Begin typing your search above and press return to search.

హీరామండి : వేశ్య‌లు కాదు పారిజాత‌ పుష్పాలు

త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. 'హీరామండి: ది డైమండ్ బజార్' ఆల్బమ్‌లోని మొదటి పాటను శనివారం విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   10 March 2024 4:30 PM GMT
హీరామండి : వేశ్య‌లు కాదు పారిజాత‌ పుష్పాలు
X

అవును.. వీళ్లు వేశ్య‌లు కాదు.. సుంద‌ర‌మైన‌ పారిజాత పుష్పాలు.. చూడ‌గానే గుండె కొల్ల‌గొట్టే అందంతో ఈ స‌ద‌రు క‌న్నె పుష్పాలు మ‌న‌సు గిల్లుతున్న తీరుకు మంత్ర‌ముగ్ధం అయిపోకుండా ఎవ‌రైనా ఉండ‌గ‌ల‌రా? అదే క‌దా క‌ళ అంటే... క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నుంచి వ‌స్తున్న మ‌రో క‌ళాత్మ‌క చిత్రంగా హీరామండి ఇప్ప‌టికే వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ఇంత‌కుముందు అత‌డి నుంచి వ‌చ్చిన గంగూభాయి క‌థియావాడి వేశ్య‌ల నేప‌థ్యంలోని సినిమా.

ఇప్పుడు అందుకు సాపేక్షంగా .. వేశ్య‌ల జీవితాల‌తోనే మ‌రో చారిత్ర‌క క‌థ‌ను ఎంపిక చేసుకుని భ‌న్సాలీ భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఎప్ప‌టిలానే అతి భారీ రాజ ప్రాకారాల‌ను సెట్ల‌లో నిర్మించి హీరామండిని తెర‌కెక్కించాడు. త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. 'హీరామండి: ది డైమండ్ బజార్' ఆల్బమ్‌లోని మొదటి పాటను శనివారం విడుదల చేశారు. సకల్ బాన్ అనే పేరుతో ఈ మ్యూజిక్ వీడియో అందాల పారిజాతాల‌ను క‌న్నుల‌పండుగగా ఆవిష్క‌రించింది. మనీషా కొయిరాలా, రిచా చద్దా, అదితి రావ్ హైదరీ, షర్మిన్ సెగల్‌లపై చిత్రీకరించిన పాట ఇది. ఇటీవలే తన మ్యూజిక్ లేబుల్ భన్సాలీ మ్యూజిక్‌ను ప్రారంభించిన త‌ర్వాత భ‌న్సాలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో మొదటి పాట 'స‌క‌ల్ బ‌న్‌'ను విడుదల చేయ‌డం ఆస‌క్తిక‌రం.

సంజయ్ లీలా భ‌న్సాలీ క్రియేషన్ నుండి వీక్షకులు ఏం ఆశిస్తారో అలాంటి ప్ర‌తిదీ ఆ పాట‌లో క‌నిపించాయి. నాటి కాలాన్ని త‌ల‌పించే వాతావ‌ర‌ణం.. కాస్ట్యూమ్స్, గ్రాండ్ సెట్ , నేపథ్య డ్యాన్సర్‌ల నుండి ప్ర‌తిదీ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. కృతి మహేష్ - విజయశ్రీ చౌదరి సుష్ట ఈ పాట‌కు కొరియోగ్రఫీ అందించారు. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో మనీషా కొయిరాలా పాత్ర షర్మిన్‌ ఇతర వేశ్య‌ల‌ను నియంత్రిస్తుంది. వేశ్య‌ల‌ ప్రాంగణంలో రిచా చద్దా పాత్ర మనోహరంగా నృత్యం చేస్తూ ఉంటే.. కొన్ని క్షణాల తర్వాత మనీషా కూడా నృత్యంలో చేరుతుంది. అదితి రావ్ హైదరి ఈ బృందానికి అద‌న‌పు చేరిక‌. అమీర్ ఖుస్రో సాహిత్యం.. రాజా హసన్ గానం సకల్ బాన్ కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా, ఉమేష్ జోషి, విజయ్ ధురి, శ్రీపాద్ లేలే, అమిత్ పాధ్యే, షాజాద్ అలీ నేపథ్య గానం ఆక‌ట్టుకుంది. ఆస‌క్తిక‌రంగా స‌క‌ల్ బ‌న్ లిరిక్ లో నిజాముద్దీన్ ని ప్ర‌స్థావిస్తూ ఒక లైన్ వినిపించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. నిజాముద్దీన్ సంస్థానం ఏలిక‌లోను వేశ్య‌ల క‌థ‌లతో హీరామండి క‌నెక్ష‌న్ ఏమిట‌న్న‌ది స‌స్పెన్స్.

భన్సాలీ ప్రొడక్షన్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేసి దీనికి క్యాప్ష‌న్ ఇచ్చింది. ''అందం, బలం దయతో వికసించే పూల సీజన్‌ను సెల‌బ్రేట్ చేసుకోవడానికి వసంతంలోకి అడుగు పెట్టండి!'' అనే క‌వితాత్మ‌క‌ క్యాప్షన్‌ను దీనికి జోడించారు. ఈ వీడియోపై స్పందిస్తూ ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు. ''మనీషా కొయిరాలా చాలా అందంగా డ్యాన్స్ చేస్తోంది. ఆమెను చూడటం ఒక ట్రీట్.. డ్యాన్స్ ని చంపుతోంది'' అని రాసాడు. సంగీతం, సెట్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్.. జస్ట్ వావ్ అని ఒక అభిమాని స్పందించారు.

అయితే ఈ పాట‌లో సోనాక్షి సిన్హా పాత్ర ప్ర‌వేశించ‌లేదు. ఈ బ్యూటీ కూడా ఇందులో కీలక పాత్రలో నటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ 1940ల నాటి భారత స్వాతంత్య్ర పోరాట కాలంలో గందరగోళ నేపథ్యానికి వ్యతిరేకంగా వేశ్యలు, వారి పోషకుల కథలతో అబ్బురపరిచే హీరామండి జిల్లా సాంస్కృతిక వాస్తవికతను తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. రిలీజ్ తేదీని భ‌న్సాలీ ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ గత నెలలో విడుదలైంది.