Begin typing your search above and press return to search.

హార్ట్ ఆఫ్ స్టోన్ మినీ సమీక్ష: ఆలియా-గాల్ అడ్వెంచ‌ర్స్ వ‌ర్క‌వుట‌య్యేనా?

ఛేజ్ లు.. యాక్ష‌న్ దృశ్యాలు.. సాహ‌సాలు.. చివ‌రిలో ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ .. ఇవ‌న్నీ స్పై థ్రిల్ల‌ర్ల‌లో కామ‌న్ గా క‌నిపించేవే.

By:  Tupaki Desk   |   13 Aug 2023 3:14 PM GMT
హార్ట్ ఆఫ్ స్టోన్ మినీ సమీక్ష: ఆలియా-గాల్ అడ్వెంచ‌ర్స్ వ‌ర్క‌వుట‌య్యేనా?
X

స్పై థ్రిల్లర్‌లు అన్నీ ఒకేలా వ‌ర్క‌వుట్ అవ్వ‌వు. అవే ఛేజ్ లు.. యాక్ష‌న్ దృశ్యాలు.. సాహ‌సాలు.. చివ‌రిలో ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ .. ఇవ‌న్నీ స్పై థ్రిల్ల‌ర్ల‌లో కామ‌న్ గా క‌నిపించేవే. నెట్‌ఫ్లిక్స్ తాజా యాక్షన్ స్పై థ్రిల్లర్ `హార్ట్ ఆఫ్ స్టోన్` వీట‌న్నిటి కంటే అతీత‌మైన‌ది కాదు. గాల్ గాడోట్ లాంటి హాలీవుడ్ ఉత్త‌మ న‌టితో ఆలియా లాంటి భార‌తీయ ఉత్త‌మ న‌టి క‌లిసి ప‌ని చేసిన సినిమా కాబ‌ట్టి ఈ సినిమాకి భార‌త‌దేశంలోను బోలెడంత హైప్ నెల‌కొంది. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందుకుందా? అంటే పెద‌వి విరిచేసేవాళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

గూఢ‌చారి సినిమాల్లో ఉండే స్టైల్ థ్రిల్స్ యాక్ష‌న్ సీన్స్ కి కొద‌వేమీ లేదు కానీ.. సినిమా క‌థ‌నంలో ర‌క‌ర‌కాల క‌న్ఫ్యూజ‌న్స్ చివ‌రికి స‌మాధానాలు లేని ఎన్నో అంశాలు ఆడియెన్ కి బోర్ కొట్టిస్తాయి. గాల్ గాడోట్ రాచెల్ స్టోన్ గా న‌టించ‌గా.. ఆమె గేమ్‌లో MI-6 గూఢచారిగా క‌నిపిస్తుంది. ది చార్టర్ అనే రహస్య సంస్థతో రాచెల్ అనుబంధం కలిగి ఉంటుంది.

రాచెల్ ఆమె సహచరులు పార్కర్ (జామీ డోర్నాన్), థెరిసా యాంగ్ (జింగ్ లూసీ), మాక్స్ (బెయిలీ) ఇటలీ నుండి ప్రారంభించి ప్రపంచాన్ని కదిలించే సాహస యాత్రకు బ‌య‌ల్దేరుతారు. ముల్వానీ అనే వ్యక్తిని పట్టుకోవ‌డ‌మే అజెండా. చార్టర్ నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న యువ భారతీయ హ్యాకర్ కీయా ధావన్ (ఆలియా భట్)ని ఇక్కడే రేచెల్ (గాల్ గాడోట్) కలుసుకుంటుంది. ఏ సిస్టమ్‌ను అయినా హ్యాక్ చేయగల సామర్థ్యం ఉన్న డేటాబేస్ అయిన ది హార్ట్‌ను స్వాధీనం చేసుకుంటుంది. అయితే క‌థ‌నంలో కొన్ని చిక్కుముడుల‌కు కార‌ణాలేమిటో అర్థం కావు. ది చార్టర్ లాగానే, .. ది హార్ట్ గురించి చాలా ప్రశ్నలు ఎదుర‌వుతాయి. కానీ వాటికి సమాధానాలు లేవు. ఇది కూడా ఒక‌ సగటు స్పై థ్రిల్లర్ లాగానే అనిపిస్తుంది. హార్ట్ ఆఫ్ స్టోన్ లోను కుట్ర‌లు, మోసాలు, దాచిపెట్టిన ఎజెండాలు.. వ‌గైరా వ‌గైరా రొటీన్ గా అనిపిస్తాయి. అయితే క‌థ‌నం న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ అయ్యార‌ని కూడా అర్థ‌మ‌వుతుంటుంది.

హార్ట్ ఆఫ్ స్టోన్‌లో అలియా (హాలీవుడ్ అరంగేట్రంలో) .. గాల్ గాడోట్ అనే ఇద్దరు బలమైన న‌టీమ‌ణులు ఉన్నా కానీ వారి ప్రతిభను పూర్తి స్థాయిలో ఉపయోగించడంలో ద‌ర్శ‌కుడు విఫలమయ్యారు. చిక్ డ్రెస్సింగ్, స్ట్రెయిట్ హెయిర్ .. స్కిన్-టైట్ రెక్సిన్ ప్యాంట్‌- జాకెట్ లతో కూడిన స్త్రీ గూఢచారి గెటప్‌ల మూస పద్ధతులను విడనాడడం కోసం మేకర్స్ స‌హ‌జ‌త్వాన్ని ఆశ్ర‌యించారు. న‌టీమ‌ణులు వారి పని పరిస్థితులకు అనుగుణంగా ఉండే దుస్తులలో కనిపిస్తారు. కానీ అలా చేయ‌డం ప్రేక్ష‌కుల ఆలోచ‌న‌ల్ని డైవ‌ర్ట్ చేస్తుంది. కథాంశంతో మనల్ని నిమగ్నం చేయడంలో విఫలమవుతుంది. దాదాపు 120 నిమిషాల రన్‌టైమ్ ఉన్న స్పై థ్రిల్లర్ - హార్ట్ ఆఫ్ స్టోన్‌లో గుర్తుండిపోయే సెట్ పీస్‌లు లేకపోవడం నిరాశపరిచింది. హార్ట్ ఆఫ్ స్టోన్‌లో హైలైట్‌గా చెప్పుకునే ఒక్క సీక్వెన్స్ కూడా సినిమా చూసొచ్చాక‌ గుర్తుకు రాకపోవడం చాలా బాధాకరం.

ఆలియా - గాల్ గాడోట్ తెరపైకి వచ్చినప్పుడు ఎంతగా షైనింగ్ వాతావ‌ర‌ణాన్ని తెస్తారో.. అంత‌కుమించి సినిమా క‌థ‌నం ఎగ్జ‌యిట్ చేయ‌క‌పోవ‌డం పెద్ద మైన‌స్ అని చెప్పాలి. ఒక పాయింట్ తర్వాత మనం మారుతున్న దృశ్యాలు ఫ్లాట్‌లైన్ కథనం అనంతమైన లూప్‌లో చిక్కుకుపోయామా అనిపిస్తుంది. గూఢ‌చారి సినిమాల్లో చాలా తక్కువ ప్రభావం క‌లిగి ఉన్న చిత్ర‌మిది. ఒక పాయింట్ తర్వాత ఎంఐ ఆటగాళ్లకు ఏం జరుగుతుందో పట్టించుకునే ప‌రిస్థితి ఆడియెన్ కి ఉండ‌దు. చార్టర్ టీమ్ లేదా హార్ట్ టీమ్ ఏది విన్ అవ్వాలో కూడా ఆడియెన్ ప‌ట్టించుకోరు. చివరగా హృదయాలు రాయిలా భారంగా మార‌తాయి. ఈ సినిమాకి గాల్ గాడోట్ - ఆలియా భ‌ట్ న‌ట‌న అస్సెట్ అనుకున్నా కానీ ద‌ర్శ‌క‌త్వ లోపాలు ఇబ్బందిక‌రం అని చెప్పాలి.

దర్శకుడు: టామ్ హార్పర్

తారాగణం: గాల్ గాడోట్, అలియా భట్, జామీ డోర్నన్ త‌దితరులు

స్ట్రీమింగ్ ఆన్: Netflix