డెలివిరీ బోయ్ టూ నటుడిగా!
సినీ పరిశ్రమలో రాణించాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదు. అంకితభావం , మొక్కవోని దీక్ష ఉండాలని మరో నటుడు హర్షవర్ధన్ రాణే నిరూపించాడు.
By: Srikanth Kontham | 25 March 2026 9:30 AM ISTసినీ పరిశ్రమలో రాణించాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదు. అంకితభావం , మొక్కవోని దీక్ష ఉండాలని మరో నటుడు హర్షవర్ధన్ రాణే నిరూపించాడు. ఒక సాధారణ డెలివరీ బాయ్ స్థాయి నుండి నేడు బాలీవుడ్ , టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటుడిగా ఎదగడం వెనుక ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భావోద్వేగపూరితమైన పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.తన కెరీర్ తొలినాళ్లలో పొట్టకూటి కోసం డెలివరీ బాయ్‌గా పనిచేసిన రోజులను హర్షవర్ధన్ గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో తను ఎంతో ఆరాధించే నటుడు జాన్ అబ్రహం ఫోటోలను చూస్తూ ఎప్పటికైనా ఆయనలా అవ్వాలని కలలు కనేవాడినని తెలిపారు. అప్పుడు కేవలం ఒక అభిమానిగా మాత్రమే ఉన్న తాను నేడు అదే జాన్ అబ్రహం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఫోర్స్ 3 చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం తన జీవితంలో అతిపెద్ద మలుపు అని ఎమోషనల్ అయ్యారు. కలలు కనే డెలివరీ బాయ్స్ అందరికీ నేను ఒకటి చెబుతున్నాను. కఠినమైన వీధులు మిమ్మల్ని దృఢంగా మారుస్తాయి. సమయానికి ఆర్డర్ డెలివరీ చేయాలనే ఒత్తిడి మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది అని హర్షవర్ధన్ రాసిన మాటలు ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తున్నాయి.
కేవలం ఆర్డర్లను డెలివరీ చేయడం మాత్రమే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుదలను ఎలా పెంచుకోవాలో తన జీవిత అనుభవాల ద్వారా ఆయన వివరించారు. ఎండ, వాన అనే తేడా లేకుండా కష్టపడే వారికే విజయం వరిస్తుందని నమ్ముతానన్నారు. హర్షవర్ధన్ రాణే ప్రయాణం నిజంగా ఒక సినిమా కథను తలపిస్తుంది. తెలుగులో తకిట తకిట సినిమాతో కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటుపై ప్రేమ ఇష్క్ కాదల్, అవును వంటి చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి సనమ్ తేరి కసమ్ తో అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
తాజాగా తనకు ఇష్టమైన హీరో జాన్ అబ్రహం నిర్మాణంలోనే నటిస్తుండటం ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. జాన్ అబ్రహం కూడా హర్షవర్ధన్ ప్రతిభను గుర్తించి తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా ప్రోత్సహిస్తు న్నారు. ఫోర్స్ 3 హర్షవర్ధన్ రాణే పంచుకున్న ఈ అనుభవాలు ఇండస్ట్రీలో ఎదగాలనుకునే ఎంతో మందికి ఒక గైడ్‌లా పనిచేస్తాయి. కలలు కనండి.. వాటిని నిజం చేసుకోవడానికి ఎంతటి కష్టానికైనా వెనకాడకండి అనే సందేశాన్ని ఆయన తన జీవితం ద్వారా చాటి చెప్పారు. రెండేళ్లగా హర్షవర్దన్ బాలీవుడ్ లో సినిమాలతోనే బిజీగా ఉన్నాడు.
తెలుగు లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో కెరీర్ ని హిందీలో నే బలంగా నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
