వీడియో: విమానంలో ఏడ్చేసిన అభిమాని.. హీరో ఏం చేసాడో చూసారా?
విమానంలో ఇది అరుదైన ఘటన. ఆ యువతి తన ఫేవరెట్ హీరోని చూసిన క్షణం ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది.
By: Tupaki Desk | 9 Jun 2025 4:00 PM ISTవిమానంలో ఇది అరుదైన ఘటన. ఆ యువతి తన ఫేవరెట్ హీరోని చూసిన క్షణం ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీటి పర్యంతం అయింది. తన మనసులో ఉన్నది వెంటనే ఆ హీరో ముందు చెప్పేసింది. అది వీక్షించేందుకు అరుదైన దృశ్యం. తన అభిమాని కన్నీటి పర్యంతం అయినప్పుడు ఏ హీరో అయినా ఎలా స్పందించాలి? ఈ దృశ్యంలో యువహీరో హర్షవర్ధన్ రాణే స్పందించిన తీరు మనసుల్ని గెలుచుకుంది.
అతడు తన అభిమాని తలపై చేతిని ఉంచి బ్లెస్ చేసాడు. ఆప్యాయంగా మాట్లాడాడు. ``దేవుడు నిన్ను దీవించుగాక, నేను నిన్ను గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నాను`` అని అన్నాడు. ఆ యువతి అప్పటికీ ఆనంద భాష్పాలను ఆపుకోలేని సన్నివేశంలో ఉంది. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్షవర్ధన్ తన ఇన్‌స్టాలో కూడా ఈ విషయాన్ని షేర్ చేసాడు.
వైరల్ భయానీ షేర్ చేసిన వీడియోలో.. హర్షవర్ధన్ రాణే - ఎయిర్ హోస్టెస్‌లు ఆ యువతిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఆ మహిళా అభిమాని ఎమోషనల్ అవుతూ ఇలా చెప్పింది. ``ప్రజలు ఒకరి కోసం ఎలా ఏడుస్తారో అనుకునేదానిని.. కానీ నేను సంతోషంగా ఉన్నాను.. అందుకే నేను ఏడుస్తున్నాను. నేను మీ సినిమా చూసినప్పుడు ఎనిమిదో తరగతిలో ఉన్నాను. మూడు సంవత్సరాలైంది. మీ సినిమాను సగం మాత్రమే చూశాను.. అప్పటి నుండి మీరే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి`` అని హర్షవర్ధన్ పై అభిమానం చాటుకుంది. ఆ క్షణం అతడు ఆ యువ అభిమానిని ఆశీర్వదించిన తీరు, వినయ విధేయతలు ఆకట్టుకున్నాయి.
`సనమ్ తేరి కసమ్` రీరిలీజ్ చేసిన తర్వాత హర్షవర్ధన్ ఫేట్ మారిపోయింది. కరోనాకష్ట కాలంలో రిలీజైన ఆ సినిమా మొదటి రిలీజ్ లో ఫ్లాపై, రెండో రిలీజ్ లో బంపర్ హిట్టు కొట్టడం ఒక సంచలనం. నిర్మాతలకు చాలా లాభాలొచ్చాయి. అతడు తదుపరి `దీవానే కి దీవానేయత్` అనే రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో నటిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం నాడు టైటిల్ ని అధికారికంగా ఆవిష్కరించారు. 2 అక్టోబర్ 2025న గాంధీ జయంతి లేదా దసరా సమయంలో థియేటర్లలో విడుదలవుతుంది. ఇందులో సోనమ్ బజ్వా కథానాయిక.