Begin typing your search above and press return to search.

సదరు వెబ్‌సైట్‌ పేరు కూడా చెప్తే సరిపోయేదిగా హరీశ్..?

టాలీవుడ్ లో ఏదైనా ముక్కుసూటిగా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ, ఎలాంటి విషయాన్నైనా గుండబద్దలు కొట్టినట్లు చెప్పే వ్యక్తుల్లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఒకరు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 3:30 AM GMT
సదరు వెబ్‌సైట్‌ పేరు కూడా చెప్తే సరిపోయేదిగా హరీశ్..?
X

టాలీవుడ్ లో ఏదైనా ముక్కుసూటిగా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ, ఎలాంటి విషయాన్నైనా గుండబద్దలు కొట్టినట్లు చెప్పే వ్యక్తుల్లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఒకరు. సినిమాల్లో వన్ లైనర్స్ మాదిరిగానే, సినీ ఈవెంట్స్ లో పంచ్ డైలాగ్స్ పేల్చే వక్తల్లో ఆయనొకరు. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీలు చెలరేగినా, లెక్క చేయకుండా ముందుకు సాగుతుంటాయి. అందుకే ఆయన సినిమాలకే కాదు, యాటిట్యూడ్ కి, స్పీచ్ లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇటీవల కాలంలో సినిమాలతో కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హరీష్.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

'ఈగల్' సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ హరీష్ శంకర్.. పలు వెబ్సైట్లు కావాలనే సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చాయని మండిపడ్డారు. "ఒకదాంట్లో 'లవ్ స్టోరీ ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది' అని రాశారు. దీనికేమైనా 'ప్రేమ పావురాలు', 'ప్రేమ పంజరం' 'ప్రేమాలయం' అని టైటిల్‌ పెట్టారా? గడ్డం పెంచుకుని, తుపాకీ పట్టుకుని హీరో కనిపిస్తుంటే.. లవ్ ఎక్స్పెక్ట్ చేశామని మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలో బేసిక్ గా నాకు అర్థం కాలేదన్నారు. నేను ఏం మాట్లాడినా అదన్నాడు ఇదన్నాడు అంటూ కాంట్రవర్సీ చేస్తారు.. అయినా సరే మీరు అనుకోవడం మానరు, నేను అనడం మానను" అన్నారు.

"అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్ లేదు. 'ఈగల్' సినిమా బాగా నచ్చినవాళ్ళు ఉండొచ్చు.. నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ డైరెక్టర్ ను విమర్శించే ముందు అతని జర్నీ గురించైనా ఒక్కసారి ఆలోచించాలి కదా. అందుకే ఆ రివ్యూ చూసి బాధేసింది. ఈ సినిమాలో లవ్‌ స్టోరీ లేదన్న బ్యాచే RRR లో రొమాన్స్‌ లేడని అన్నారని ఆ తర్వాత తెలిసింది. సినీ జర్నలిస్టులు కూడా సినీ ఇండస్ట్రీలో భాగమే. దాన్ని ఎవరూ మర్చిపోవద్దు. మీరు పబ్లిసిటీ చేస్తేనే మా సినిమాలు జనాలకు రీచ్ అయ్యేది. అలాంటిది మనం ఒకరిపై ఒకరం రాళ్లు వేసుకోవడమేంటి?''

"విమర్శకు, ట్రోలింగ్ కు తేడా లేకుండా పోతోంది. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. ఎవరో యూత్ సోషల్ మీడియాలో ఫన్ కోసం ట్రోలింగ్ చేస్తేఅర్థముంది. కానీ మన రివ్యూలు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారి పోతున్నాయి. అధ్బుతమైన విమర్శ చేస్తే ఎవరూ ఏమీ అనరు. కానీ అది ఎగతాళి స్థాయికి వెళ్ళడమే బాధేస్తోంది" అని హరీశ్ అన్నారు. ఈ క్రమంలో ఓ వెబ్ సైట్ షాడో ఇమేజ్ పెట్టి రాసిన వార్తను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే నేరుగా తన ఫోటో పెట్టి, హరీశ్ శంకర్ ఇలా చేశాడని వార్త రాయాలని ఛాలెంజ్ విసిరారు.

"నాలుగేళ్లు అయింది.. సినిమా లేట్ అవుతుందని నిర్మాత ఇంట్లో కూర్చొని తెల్లారే వరకూ మద్యం తాగిన డైరెక్టర్.. ఇతను పవన్ కల్యాణ్‌తో బ్లాక్‌ బస్టర్‌ తీశాడు ఇంతకు ముందు'' అని రాస్తారు. వాడికి నా ఫోటో పెట్టి మొత్తం రాసే ధైర్యం ఉండదు. ఒక షాడో ఇమేజ్ పెట్టి రాస్తారు. దమ్ముంటే నా ఫొటో పెట్టి "హరీశ్ శంకర్ తెళ్ళార్లు తాగాడు" అని రాయండి. దానికి నేను కౌంటర్ ఇస్తాను. నువ్వేమైనా నాకు పెగ్గు కలిపావా? ఐస్ వేశావా? అయినా ఎంతకాలం ఇలాంటి నాన్సెన్స్ తీసుకోవాలి?''

''నా విషయంలో ప్రతీసారి గ్యాప్ వచ్చిందంటున్నారు. ప్రస్తుతం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌', 'మిస్టర్‌ బచ్చన్‌' చేస్తున్నాను. త్వరలోనే మరో రెండు పెద్ద సినిమాల అనౌన్స్ మెంట్ వస్తుంది. నాలుగేళ్లు కాకపోతే ఐదేళ్లు సినిమా చేయకుండా ఉంటా. నేనేమన్నా నా రెంట్ కట్టండి అని మిమ్మల్ని అడుగుతున్నానా?.. విపరీతమైన పర్సనల్ ఎటాక్ చేస్తున్నారు. మేం గాంధీ మహాత్ములమని చెప్పామా మీకు?. పర్టిక్యులర్ గా సదరు వెబ్ సైట్ కి చెప్తున్నా.. మీరు ఏమన్నా రాసుకోండి."

"సినిమా పుట్టాక వెబ్‌ సైట్‌లు పుట్టాయి గానీ.. వెబ్‌ సైట్‌లు పుట్టాక సినిమా పుట్టలేదు. మీకు ట్రోలింగ్ కొత్తేమో కానీ, నాకేమీ కొత్తకాదు. మీరందరూ గుర్తు పెట్టుకోండి.. అన్నింటికీ తెగించే మేం ఇక్కడికొచ్చి నిలబడ్డాం. ఇంత చెప్పినా మళ్లీ పగ బడతాం, ఇలానే ఆర్టికల్స్ రాస్తామని అంటే.. మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్టర్ చెప్పారు.. అదే మీకు గుర్తు చేస్తున్నా.. రాసుకోండి (వెంట్రుక కూడా పీకలేరు)’’ అంటూ చాలా ఘాటుగా మాట్లాడారు హరీశ్ శంకర్.

అది కూడా కరెక్టే కదా హరీష్..?

హరీష్ శంకర్ కామెంట్స్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మెజారిటీ నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు మాత్రం, హరీశ్ శంకర్ ఇంత చెప్పీ చివరకు 'సదరు వెబ్ సైట్' అని సంబోధించారని, పేరు చెప్పకుండా తప్పించుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. పర్సనల్ ఎటాక్ చేస్తూ ఆర్టికల్స్ రాస్తున్నారన్నప్పుడు, ఆ వెబ్ సైట్ పేరు కూడా చెప్పి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.