Begin typing your search above and press return to search.

మరో నందమూరి వారసుడి ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

టాలీవుడ్ లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది వారసులు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు

By:  Tupaki Desk   |   26 March 2024 7:07 AM GMT
మరో నందమూరి వారసుడి ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
X

టాలీవుడ్ లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది వారసులు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న అలా చాలా మంది టాలీవుడ్ కు పరిచయమై తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ అంతా.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదిగో అదిగో అని అంటున్నా.. ఎలాంటి ప్రకటన రావడం లేదు.

ఇప్పుడు మోక్షజ్ఞ కన్నా ముందే మరో నందమూరి వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. అది ఎవరో కాదు.. దివంగత నటుడు నందమూరి హరికృష్ణ మనవడు. అయితే హరికృష్ణకు ముగ్గురు కుమారులు కాగా.. తారక్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు జానకి రామ్ 2014లో ప్రమాదానికి గురై కన్నుమూశారు. ఇప్పుడు ఆయన కుమారుడు తారక రామారావు ఎంట్రీ ఇస్తున్నారట.

ప్రస్తుతం నెట్టింట ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. నందమూరి నయా వారసుడి ఎంట్రీ బాధ్యతను సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు హరికృష్ణతో మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య తదితర సినిమాలు వచ్చాయి. అవి టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

కొన్నేళ్ల క్రితం సూపర్ హిట్ సినిమాలు చేసిన వైవీఎస్.. ఆ తర్వాత వరుస ప్లాపులు రావడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో రేయ్ మూవీ తీయగా.. అది కూడా డిజాస్టర్ అయింది. మూవీలు తీయకపోయినా.. పలు సినిమాల ఈవెంట్స్ కు హాజరవుతుంటారు. ఇప్పుడు సుమారు పదేళ్ల తర్వాత.. మళ్లీ హరికృష్ణ మనవడితో వైవీఎస్ రీఎంట్రీ ఇవ్వనున్నారట. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారట.

ఇప్పుడు జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా దొరక్కపోవడం గమనార్హం. చిన్నప్పుడు జరిగిన పంచె ఫంక్షన్ కు సంబంధించిన పిక్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ హీరో ఎలా ఉన్నారోనని నందమూరి ఫ్యాన్స్ అంతా ఎదురుచుస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికార ప్రకటన రానుందట. మరి ఈ ఎన్టీఆర్.. తన తాత, ముత్తాత, బాబాయిల్లా టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పిస్తారో లేదో చూడాలి.