'కన్నప్ప' మీదికి 'వీరమల్లు'?
హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడు? ఇప్పుడు టాలీవుడ్‌లో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. పలుమార్లు వాయిదా పడ్డాక జూన్ 12కు షెడ్యూల్ అయిన ఆ చిత్రాన్ని అనివార్య పరిస్థితుల్లో మరోసారి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 11:48 AMహరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడు? ఇప్పుడు టాలీవుడ్‌లో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. పలుమార్లు వాయిదా పడ్డాక జూన్ 12కు షెడ్యూల్ అయిన ఆ చిత్రాన్ని అనివార్య పరిస్థితుల్లో మరోసారి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జులైలో కొత్త డేట్ల కోసం వెతుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందే సినిమా రిలీజైపోతుందా అనే చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్న సంస్థ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిలోనూ అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
‘హరిహర వీరమల్లు’ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రిమియర్స్ ఈ నెల 26న పడబోతున్నట్లుగా ఈ పోస్టర్లో పేర్కొన్నారు. అంటే 'వీరమల్లు' జూన్ 27న వరల్డ్ వైడ్ రిలీజవుతుందని భావించాలి. ఇది ఫేక్ పోస్టరేమో అని కొందరు అంటున్నా.. అలాంటిదేమీ లేదని, నిజంగానే ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. జులై రిలీజ్ కోసం చూసినప్పటికీ.. సరైన డేట్ కుదరకపోవడం, అప్పటికి మరీ ఆలస్యం అయిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో జూన్ 27కు సినిమాను షెడ్యూల్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
నిజానికి జూన్ చివరి వారం డేట్ కోసం ఇంతకుముందే ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ను వాయిదా వేసుకోవాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందుకు విష్ణు ససేమిరా అన్నాడు. అది కూడా పాన్ ఇండియా సినిమా. వాయిదా పడి రిలీజవుతోంది. అందుకే ఇంకోసారి డేట్ మారిస్తే కష్టమని భావించాడు విష్ణు. కానీ ఇప్పుడు అలాంటి పెద్ద సినిమాకు పోటీగా ‘హరిహర వీరమల్లు’ను రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య తప్పదు. అలాగే రెవెన్యూ పరంగా రెండు చిత్రాలకూ నష్టమే. అయినా సరే 'వీరమల్లు'ను 'కన్నప్ప' వచ్చిన రెండు రోజులకే రిలీజ్ చేయాలనుకుంటున్నారంటే ఆశ్చర్యమే. మరి నిజంగా ఆ డేట్‌కు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.