Begin typing your search above and press return to search.

వీరమల్లు.. ఆ విషయంలో నిర్మాత పర్ఫెక్ట్ డిసిషన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా జూన్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jun 2025 10:07 AM IST
వీరమల్లు.. ఆ విషయంలో నిర్మాత పర్ఫెక్ట్ డిసిషన్!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా జూన్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యం హైలెట్ కానుంది. ఇక ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఈ సినిమా రిలీజ్‌కు ముందు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా టికెట్ ధరల సవరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారానే దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధన ద్వారా ఫిల్మ్ ఛాంబర్ ఒక కేంద్ర సంస్థగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్మాతల తరపున నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ నిర్ణయానికి అనుగుణంగా, నిర్మాత ఎ.ఎమ్. రత్నం జూన్ 2న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్‌ను కలిసి, ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల సవరణ, స్పెషల్ షోల అనుమతి కోరుతూ అధికారిక లేఖను సమర్పించారు. పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఈ చర్యను పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం, సినిమాపై ఆయన ప్రమేయం దృష్ట్యా సింబాలిక్ స్టెప్‌గా చూస్తున్నారు.

అంతకుముందు, రత్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, తెలంగాణలో కూడా టికెట్ ధరల సవరణ కోసం అభ్యర్థన చేశారు. ఈ సమావేశం సానుకూల ఫలితాలను ఇచ్చినట్లు సమాచారం, త్వరలో ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపును టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

టికెట్ ధరల సవరణతో ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్‌లలో, సింగిల్ స్క్రీన్‌లలో వేరు వేరు ధరలు పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పెషల్ షోలతో మొదటి వారంలో సాలీడ్ వసూళ్లను సాధించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల గ్రాస్ టార్గెట్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా, రత్నం సింబాలిక్ స్టెప్‌తో ‘హరిహర వీరమల్లు’ టీమ్ కొత్త నిబంధనలకు అనుగుణంగా టికెట్ ధరల సవరణ కోసం ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఇక ఈ సినిమా రిలీజ్‌తో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎలాంటి విజువల్ ట్రీట్ అందుతుందో చూడాలి.