రాజమౌళి మూవీ రేంజ్‌లో వీరమల్లు క్లైమాక్స్...!
పవన్ కళ్యాణ్ అభిమానులు గత రెండు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
By: Tupaki Desk | 12 Jun 2025 7:00 PM ISTపవన్ కళ్యాణ్ అభిమానులు గత రెండు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికే వీరమల్లు సినిమా విడుదల కావాల్సి ఉన్నా కూడా వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో ఈ సినిమా విడుదల ఉంటుంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవలే సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి అయిందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమా క్లైమాక్స్‌లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ అద్భుతంగా వచ్చినట్లు మేకర్స్ ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.
పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కథ రీత్యా వీఎఫ్‌ఎక్స్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అందుకే సినిమా వాయిదా వేసి మరీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను క్వాలిటీగా చేసినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్‌లో మెజార్టీ మొత్తంను వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం కేటాయించామని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం అత్యధికంగా ఖర్చు చేశారట. అందుకే ఈ సినిమాలోని క్లైమాక్స్ రాజమౌళి సినిమా మాదిరిగా విజువల్ వండర్‌గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రాఫిక్స్‌ను రాజమౌళి రేంజ్‌లో మరే దర్శకుడు వినియోగించలేడు అంటారు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్స్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమా ఆచలా ఆలస్యం అయింది. దాంతో దర్శకుడు క్రిష్ తప్పని పరిస్థితుల్లో సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ బ్యాలన్స్ షూట్‌ను పూర్తి చేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమాను చూశారని, ఆయన చాలా సంతృప్తిని వ్యక్తం చేశారని దర్శకుడు జ్యోతికృష్ణ అన్నాడు. సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌తో మరింత అద్భుతంగా ఉంటుందనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండగా రాబోతున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర, ఆయన లుక్ అంచనాలు పెంచాయి. ప్రతి సీన్‌లోనూ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటనను ఫ్యాన్స్ ఆస్వాదిస్తారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు, ఇతర యూనిట్ సభ్యులు పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు, అంతే కాకుండా పలు ఈవెంట్స్‌ను నిర్వహించారు. సినిమా విడుదల సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం గురించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
