రికార్డ్ బ్రేక్... వీరమల్లు వేట మొదలు
పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా రెగ్యులర్ సినీ ప్రేమికులు 'హరి హర వీరమల్లు' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 4 July 2025 12:19 PM ISTపవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా రెగ్యులర్ సినీ ప్రేమికులు 'హరి హర వీరమల్లు' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. అలాంటి పవన్ కళ్యాణ్‌తో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించడంతో మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను మొదలు పెట్టి సగానికి పైగా పూర్తి చేశాడు. కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత నెల నుంచి అదుగో ఇదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కి మంచి స్పందన దక్కింది. జ్యోతి కృష్ణ పై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. క్రిష్ మధ్యలో వదిలి పెట్టి పోయాడు కనుక, మిగిలిన షూటింగ్‌ను మమా అనిపించేసి ఉంటారు, సినిమా అంతగా బాగుండదేమో అని కొందరు అనుకున్నారు. కానీ జ్యోతికృష్ణ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ట్రైలర్‌ను అంచనాలు పెంచే విధంగా కట్ చేయడంలో సఫలీకృతం అయ్యాడని చెప్పాలి.
హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ నమోదు అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ తెలుగు వర్షన్‌కి మొదటి 24 గంటల్లో ఏకంగా 48 మిలియన్‌ల వ్యూస్ నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ట్రైలర్‌కు ఈ స్థాయి వ్యూస్ నమోదు కాలేదు. ఇంకా భారీ ఎత్తున వ్యూస్ నమోదు అవుతూనే ఉన్నాయి. అతి త్వరలోనే ఈ ట్రైలర్ 100 మిలియన్‌ల వ్యూస్‌ను క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని సినీ వర్గాల వారు, సోషల్ మీడియా జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర అన్ని భాషల వర్షన్‌ల ట్రైలర్‌ల వ్యూస్ కలుపుకుంటే మొదటి 24 గంటల్లో 61.7మిలియన్‌ల వ్యూస్‌గా నమోదు అయ్యాయని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారణంగా గత రెండేళ్ల కాలంగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మొదటి సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ట్రైలర్‌కి ఆ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సైతం పాజిటివ్ రెస్పాన్స్ దక్కితే కచ్చితంగా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు కావడం ఖాయం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు గురించి ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. కనుక భారీ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా కీరవాణి సంగీతాన్ని అందించాడు. బాబీ డియోల్ విలన్‌గా కనిపించబోతున్నాడు.
