Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లుకు.. టిక్కెట్ రేట్ల పెంపు కోసం మళ్ళీ ఇలా..

ఇందులో పవన్ పాత్ర మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి, చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. ఇవే ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు చర్చలో కీలకంగా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 July 2025 12:02 PM IST
హరిహర వీరమల్లుకు.. టిక్కెట్ రేట్ల పెంపు కోసం మళ్ళీ ఇలా..
X

ఇప్పుడు 'హరిహర వీరమల్లు' విజయవంతం కావడం నిర్మాత ఏఎం రత్నంకు అత్యంత అవసరం. అయిదేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంత కష్టపడి పట్టుకొచ్చారో అందరికీ తెలిసిందే. వాయిదాలు, డేట్స్ అన్నీ ఎదుర్కొన్నాక ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాత భవిష్యత్తును నిర్ణయించేంత కీలకం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌కి ఒక విజువల్ ఎపిక్ అందించడం కోసం ఏఎం రత్నం, అన్ని విధాలా భారీ స్థాయిలోనే తెరకెక్కించారు. విజువల్స్, మ్యూజిక్, గ్రాఫిక్స్ అన్నీ హై స్టాండర్డ్‌లో ఉండేలా చూసారు. ఇందులో పవన్ పాత్ర మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి, చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. ఇవే ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు చర్చలో కీలకంగా మారుతున్నాయి.

ఏపీలో ఎలాగూ ఎంతోకొంత రేట్లు పెరుగుతాయి. ఇక తెలంగాణలో మాత్రం చాలా కష్టం. పుష్ప 2 తొక్కిసలాట అనంతరం టిక్కెట్ రేట్ల విషయంలో చాలా రకాల సందిగ్దత కనిపిస్తుంది. కానీ టిక్కెట్ రేట్ల నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పెద్ద సినిమాలకు లాభం చేకూరే అవకాశాలు ఎక్కువ. అదే లాజిక్‌తో 'హరిహర వీరమల్లు' బృందం ఇప్పుడు తిరిగి ప్రయత్నిస్తోంది. గతంలోనూ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డిని నిర్మాత రత్నం కలిసి మాట్లాడారు. అప్పట్లో ఫలితం రాకపోయినా.. ఇప్పుడు సినిమా రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ చర్చలు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా తెలంగాణ చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రంగా ఉండటం, పవన్ కళ్యాణ్‌కి ఇక్కడ గట్టి ఫాలోయింగ్ ఉండటంతో.. ప్రత్యేకంగా ఆ రాష్ట్రంలో టికెట్ ధరను పెంచే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. భారీ పెంపు కాకపోయినా.. ఓ మోస్తరు పెంపు వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లలో స్పష్టమైన తేడా వస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మేకర్స్ ఈ అంశాన్ని ప్రభుత్వానికి వివరించి అర్థవంతమైన పాయింట్లు ముందుంచుతున్నట్టు సమాచారం.

ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. బిజినెస్ లెక్కల దృష్ట్యా నిర్మాతలు తమకు వీలైనంత ఆదాయం రాబట్టుకోవాలనుకోవడం సహజమే. ముఖ్యంగా నైజాంలో స్వయంగా రిలీజ్ చేయనున్న ఏఎం రత్నం, టికెట్ ధర పెంపుతో మరింత లాభాలు అందుకోవాలన్న ఆశతో ఉన్నారు. ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి గానీ, ఈ సినిమా ద్వారా టికెట్ ధరలపై నూతన చర్చకు తెరలేవడమే ఖాయం. ట్రైలర్‌తో క్రేజ్ సెట్ చేసిన ‘హరిహర వీరమల్లు’ ఇప్పుడు టికెట్ రేట్ల పర్మిషన్ మీద ఆసక్తికర మలుపు తిరుగుతోంది. ఇది కేవలం ఈ సినిమా వరకే కాకుండా.. భవిష్యత్తులో టాలీవుడ్ బడా సినిమాలందరికీ మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.