Begin typing your search above and press return to search.

టికెట్ రేట్లతో వీరమల్లు చెలగాటం?

అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల పెంపుకోసం ప్రయత్నాలు జరిగాయి. ఏపీలో ఆల్రెడీ రేట్లు పెంచుతూ జీవో కూడా ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   20 July 2025 9:32 AM IST
టికెట్ రేట్లతో వీరమల్లు చెలగాటం?
X

కొవిడ్ తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న మాట వాస్తవం. అసలే ఆక్యుపెన్సీలు తగ్గిపోతున్నాయంటే.. కాస్త క్రేజున్న సినిమాలకు టికెట్ల ధరలను పెంచి వాళ్లను మరింత నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. ఓవైపు థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదంటారు. ఇంకోవైపు వాళ్లు వద్దాం అనుకున్న సినిమాకు రేట్లు పెంచేస్తారు. ఇది కచ్చితంగా తప్పు అని ఇండస్ట్రీ వర్గాలే ఒప్పుకుంటాయి. అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాము చేస్తున్నది తప్పు అని అంగీకరించారు.

అయినా ఏ మార్పూ లేదు. ఇప్పుడు ఇటు టాలీవుడ్, అటు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. చాలా రోజుల తర్వాత విడుదల కానున్న పెద్ద సినిమా ఇది. బాగా ఆలస్యం కావడం, రిలీజ్ డేట్లు మారడం వల్ల పవన్ వేరే సినిమాలతో పోలిస్తే దీనికి కొంచెం బజ్ తక్కువ ఉన్న మాట వాస్తవం. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల పెంపుకోసం ప్రయత్నాలు జరిగాయి. ఏపీలో ఆల్రెడీ రేట్లు పెంచుతూ జీవో కూడా ఇచ్చేశారు.

ఐతే పెంపు అంటే 50-100 స్థాయిలో ఉంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు పెంచిన రేట్లు షాకిచ్చేలాగే ఉన్నాయి. మొదటి పది రోజులకు సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్‌లో రూ.100, అప్పర్ క్లాస్‌లో రూ.150 పెంచుకునే అవకాశం కల్పించారు. మల్టీప్లెక్సుల్లో రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఐతే సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధరలే రూ.100 నుంచి 150 ఉండగా.. పెంచుకునే అవకాశం కూడా అదే స్థాయిలో ఇవ్వడం అంటే టికెట్ల ధరలు డబుల్ కాబోతున్నాయన్నమాట. మల్టీప్లెక్సుల్లో ఏకంగా రూ.200 పెంపు అంటే అది కచ్చితంగా టూమచ్చే.

ఐతే ఈ మేరకు పెంచుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కానీ.. ఇక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల విచక్షణ మీద రేట్లు ఆధారపడి ఉండబోతున్నాయి. ఒకవేళ అవకాశం ఉంది కదా అని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు, మాగ్జిమం రేట్లు పెడితే మాత్రం అది కచ్చితంగా సినిమాకు చేటే చేసే అవకాశముంది. ఇంతింత రేట్లు పెట్టి ఏం చూస్తాం అని ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరం కావచ్చు. కాబట్టి ఓ మోస్తరుగా రేట్లు పెంచి సినిమాను రిలీజ్ చేస్తే మంచిదేమో.