Begin typing your search above and press return to search.

బన్నీ వల్ల పోయింది.. పవన్ వల్ల వస్తుందా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాక పెద్ద సినిమాలకు అదనపు షోలు, రేట్లు దక్కించుకోవడం చాలా తేలికగా మారింది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 11:00 PM IST
బన్నీ వల్ల పోయింది.. పవన్ వల్ల వస్తుందా?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాక పెద్ద సినిమాలకు అదనపు షోలు, రేట్లు దక్కించుకోవడం చాలా తేలికగా మారింది. ఇలా అప్లికేషన్ పెట్టుకోవడం.. అలా అనుమతులు వచ్చేయడం.. ఇలా ఉండేది పరిస్థితి. కానీ తెలంగాణలో గత డిసెంబరు ముందు వరకు సాఫీగా సాగిపోయిన ఈ ప్రక్రియకు... అనూహ్యంగా బ్రేక్ పడింది. ‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడం, ఆమె తనయుడు తీవ్రంగా గాయపడి అచేతన స్థితికి వెళ్లడం.. దీని చుట్టూ పెద్ద వివాదం చోటు చేసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు బ్రేకులేసేసింది. ప్రభుత్వం తీరు చూశాక.. తర్వాతి రోజుల్లో నిర్మాతలు అదనపు రేట్ల కోసం అనుమతులు అడగడం కూడా మానేశారు. ఏపీలో మాత్రమే అదనపు షోలు, రేట్లు వస్తున్నాయి. నిర్మాతలు దాంతో సంతృప్తి చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ధైర్యంగా ఓ అడుగు ముందుకు వేశారు.

ఇటీవలే రత్నం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన ప్రొడక్షన్లో భారీ వ్యయంతో నిర్మించిన ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 12న రిలీజవుతున్న నేపథ్యంలోనే ఆయన సీఎంను కలిశారన్నది స్పష్టం. సినిమా చాలా ఆలస్యం కావడంతో బడ్జెట్ తడిసిమోపెడైంది. పైగా అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం. దీన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాకు అదనపు రేట్లు, షోలు ఇవ్వాలని రత్నం సీఎంకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమా కాబట్టి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అదనపు రేట్లు, షోలకు అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు సానుకూలంగా జరిగితే.. ఇక నుంచి రాబోయే పెద్ద సినిమాలన్నటింకీ నిర్మాతలు మళ్లీ రేట్లు, షోల కోసం అప్లికేషన్లు పెట్టుకోవడం మామూలైపోవచ్చు. బన్నీ వల్ల ఆగిన ప్రక్రియ పవన్‌తో మళ్లీ మొదలైనట్లు అవుతుంది. ఇది ఇండస్ట్రీకి హ్యాపీ న్యూసే కానీ.. ప్రేక్షకులకు మాత్రం నిరాశ కలిగించేదే.