మీడియా ముందుకు 'వీరమల్లు' నిర్మాత.. క్లారిటీ ఇవ్వనున్నారా?
అదే సమయంలో నిర్మాత ఏ ఎం రత్నం ఇప్పుడు మీడియాతో మాట్లాడతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 19 July 2025 10:16 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మూవీ.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా.. ఔరంగజేబు నాటి కథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ మూవీ.. జులై 25వ తేదీన రిలీజ్ కానుంది.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయనున్నారు. అందుకు గాను ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఆ వేడుకలో పవన్ ఏం మాట్లాడుతారోనని అంతా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో నిర్మాత ఏ ఎం రత్నం ఇప్పుడు మీడియాతో మాట్లాడతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్న ఆయన.. నేడు (శనివారం) ప్రెస్ మీట్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో సినిమా రిలీజ్ తో పాటు బిజినెస్ డీల్స్ సహా పలు విషయాలపై ఉన్న ఊహాగానాలకు తెరదించుతారని సమాచారం.
అయితే అనేక వాయిదాల తర్వాత రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు విషయంలో నిర్మాత చేస్తున్న డిమాండ్లపై పంపిణీదారులు అసంతృప్తితో ఉన్నారని ఇండస్ట్రీలో పుకార్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సినిమా బిజినెస్ ఇంకా అసంపూర్ణంగా ఉందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆ ఊహాగానాలపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో నిర్మాత అన్నింటిపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందే క్లారిటీ ఇవ్వడం కరెక్ట్ అని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే మరికొన్ని గంటల్లో మీడియాతో ఏం మాట్లాడుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
