ఆ రెండు తగ్గవు... వీరమల్లు వచ్చే ఛాన్స్ లేదు!
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 4 Jun 2025 2:39 PM ISTపవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం వల్లే జూన్ 12న విడుదల సాధ్యం కాదని తెలుస్తోంది. వారం నుంచి పది రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే సినిమాను ఇదే నెలలో మరేదైనా డేట్‌కి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ నెల మొత్తం ఫుల్ ప్యాక్‌గా సినిమాలు ఉన్నాయి. కనుక హరిహర వీరమల్లు సినిమాను చూడాలి అంటే ప్రేక్షకులు జులై నెల వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు.
వీరమల్లు సినిమాను జూన్ 20న విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు. అయితే అదే సమయంలో ధనుష్ హీరోగా నటించిన కుబేరా సినిమా ఉంది. అయినా పర్వాలేదు పోటీగా విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ కుబేరా సినిమా ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు హరిహర వీరమల్లు సినిమా ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. అందుకే జూన్ 20న విడుదల చేయడానికి ప్రైమ్ వీడియో వారు ఒప్పుకునే పరిస్థితి లేదు. నాలుగు వారాల్ల తర్వాత రెండు సినిమాలను ఒకేసారి స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అమెజాన్ వారు జూన్ 20న వీరమల్లు సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
కుబేరా సినిమా విడుదల అయిన వారం తర్వాత మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కన్నప్ప సినిమాను తప్పించి వీరమల్లు సినిమాను దించే ప్రయత్నాలు కూడా జరిగాయట. కానీ మంచు విష్ణు మాత్రం అస్సలు తగ్గడం లేదు. జూన్ 27న కన్నప్ప సినిమాను విడుదల చేసి తీరుతాను అంటూ మంచు విష్ణు పట్టుబట్టి కూర్చున్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, సినిమా పైరసీ అయిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కన్నప్ప సినిమాను వాయిదా వేయడం సరికాదని చాలా మంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ తేదీకి కూడా వీరమల్లు సినిమా వచ్చే అవకాశం లేదు.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అయితే పూర్తి అయింది కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ తుది నిర్ణయానికి రాలేక పోతున్నారు. అందుకే సినిమా విడుదల వాయిదా పడింది. జూన్‌లో ఎలాగూ సినిమా విడుదల సాధ్యం కాదు కనుక జులై లో అయినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.
