వీరమల్లు ఫైట్ కోసం 60 రోజులు.. లెక్క తప్పుతుంది సర్!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు రెడీ అయింది.
By: Tupaki Desk | 20 July 2025 7:00 PM ISTపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు రెడీ అయింది. జులై 24న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యంగా దర్శకుడు జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఎఎం రత్నం లు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. దర్శకుడు సినిమా గురించి పదే పదే హైప్ పెంచే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వీరమల్లు సినిమా పీరియాడికల్ డ్రామాగా రూపొందిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మంచి బిజినెస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా మీడియా ఇంట్రాక్షన్‌లో దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హరి హర వీరమల్లు సినిమాలో యాక్షన్ సీన్స్ అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్‌ను తానే స్వయంగా కంపోజ్ చేశారు. బ్రూస్‌లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమాలోని సీన్స్‌ను తలపించే విధంగా ఆ యాక్షన్ సీన్ ఉంటుందని ఆయన అన్నారు. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఆ యాక్షన్ సీన్ ను ఏకంగా 60 రోజులు చిత్రీకరించినట్లు చెప్పుకొచ్చాడు. 60 రోజులు కూడా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు. ఒక్క రోజు కూడా డూప్‌తో చేయలేదని దర్శకుడు పేర్కొన్నాడు. ఒక్క యాక్షన్ సీన్ కు 60 రోజులు పట్టడం ఏంటి భయ్యా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో సినిమాను చాలా స్పీడ్‌గా, చాలా తక్కువ షెడ్యూల్స్‌లో పూర్తి అయ్యే విధంగా షూటింగ్ చేశాడు. వీరమల్లు సినిమాను సైతం చాలా తక్కువ వర్కింగ్ డేస్‌లో పవన్ పూర్తి చేశాడు అంటున్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు ఒక్క యాక్షన్ సీన్ కోసం పవన్ కళ్యాణ్ 60 రోజులు పని చేశారు అంటూ చెప్పడంతో షాకింగ్‌గా ఉందని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల ప్రమోషన్ సమయంలో దర్శకులు, నిర్మాతలు ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. 20 రోజులు చేస్తే 30 రోజులు అనడం కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా 60 రోజులు ఈ సినిమా కోసం వర్క్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి దాదాపుగా అయిదు ఏళ్లు అవుతుంది. మొదట కరోనా వల్ల వాయిదా పడింది, ఆ తర్వాత పవన్ రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ బ్రేక్ ఇస్తూ చేస్తూ వచ్చారు. పవన్ డేట్లు ఇవ్వడం లేదని దర్శకుడు క్రిష్ మరో ప్రాజెక్ట్‌ను వెతుక్కున్నాడు. అయినా కూడా ఒక్క యాక్షన్ సీన్ కోసం పవన్ 60 డేట్లు తీసుకున్నారు అంటే చాలా పెద్ద విషయం అని కొందరు ఈ విషయం గురించి స్పందిస్తున్నారు.
ఎన్ని డేస్‌లో చిత్రీకరించారు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆ యాక్షన్ సీన్ గురించి ఆసక్తి పెరుగుతోంది. సినిమాలో పవన్ స్వయంగా ఆ యాక్షన్ సీన్ కంపోజ్ చేశాడంటే అభిమానులకు ఆసక్తి పెరగడం ఖాయం. సినిమా కు వచ్చిన పాజిటివ్ బజ్ నేపథ్యంలో అత్యధిక థియేటర్‌లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నైజాంలో మైత్రి వారు ఈ సినిమాను పంపిణీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
