వీరమల్లు.. 35 కోట్లు చెబుతున్నా ఒప్పుకోవట్లేదా?
తాజా సమాచారం ప్రకారం, నైజాం హక్కుల కోసం ప్రముఖ సంస్థలు దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (SVC), మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 July 2025 12:01 PM ISTటాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమవుతున్న చిత్రం హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా త్వరలో థియేటర్లలోకి రానుంది. ట్రైలర్, పోస్టర్స్, పాటలు ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేశాయి. జూలై 24న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. జులై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతోంది.
అయితే ప్రమోషన్ విషయం పక్కన పెడితే, ఈ సినిమా బిజినెస్ విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. థియేట్రికల్ రైట్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇంకా లేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. డిస్ట్రిబ్యూషన్ డీల్స్ ఫిక్స్ కావాల్సిన సమయంలో, ఇంకా నిర్ణయం తీసుకోలేకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇతర ఏరియాలలో కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు.
తాజా సమాచారం ప్రకారం, నైజాం హక్కుల కోసం ప్రముఖ సంస్థలు దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (SVC), మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. 35 కోట్ల పరిధిలో ఈ సినిమా కొనుగోలు చేయాలన్నదే వారి ఆలోచన. కానీ నిర్మాత ఏఎం రత్నం మాత్రం ఈ ఆఫర్లను పక్కన పెట్టి స్వయంగా విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీని కోసం ఆయన క్రౌన్ మూవీస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా నైజాంలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇండస్ట్రీ టాక్.
ఇలా బిజినెస్ డీల్స్ మధ్యలో నిర్మాత డైరెక్ట్ ఓనర్‌షిప్ వైపు వెళ్లడంపై అభిప్రాయభేదాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల బిజినెస్ ఎక్కడా సెటిల్ అవ్వకపోవడం, థియేటర్ల బుక్ చేయడంలో జాప్యం, ప్రమోషన్ సపోర్ట్ లో కూడా తేడా రావచ్చు. ఇదంతా సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే నైజాంలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్, మార్కెట్ స్టామినా దృష్టిలో ఉంచుకుని స్వీయ విడుదలతో మంచి లాభాలు వస్తాయని నిర్మాత ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రయోగం కలిసొస్తుందా లేదా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి జూలై 24న ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో, ఈ బిజినెస్ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
