పవన్ సినిమాతో మాకేం సంబంధం.. బాలయ్య చిత్రానికి మేం అడిగామా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాపై ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా థియేటర్లలో రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 28 July 2025 5:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాపై ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా థియేటర్లలో రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ ఈ సినిమాపై ఏపీలో వైసీపీ బ్యాచ్ ఈ సినిమాను బాయ్ కాట్ అని ప్రచారం చేసింది. అలాగే రిలీజ్ తర్వాత కూడా సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసింది.
అయితే వైసీపీ ప్రచారాన్ని జనసేన తిప్పికొట్టాలని చూస్తోంది. పవర్ స్టార్ ఈ సినిమా ధర్మరక్షణ కోసం తీసిందని, వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత జనసేనతో పాటు కూటమి భాగస్వామి పార్టీలైన తెలుగుదేశం, బీజేపీపైనా ఉందని జనసేన నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు నెగెటివిటీని ఎదుర్కొనేందుకు నడుం బిగించారు. స్వయంగా షో లు వేయించి కార్యకర్తలకు, ప్రేక్షకులకు ఉచితంగా ఈ సినిమా చూపిస్తున్నారు. రీసెంట్గా ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ అధికారిక భవనంలోనూ ఈ సినిమా స్పెషల్ షో స్ర్కీనింగ్ అయిన విషయం తెలిసిందే!
ఇక్కడే టీడీపీ- జనసేన కింది స్థాయి క్యాడర్ కు పొసకడం లేదు. తాము ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాను నెత్తిమీదేసుకొని కాపాడాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు చూస్తే స్పష్టంగా అర్థం అయిపోతుంది. సినిమాలో మ్యాటర్ ఉంటే ఎవరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని, అదే ఇంకెవరైనా నెగెటివ్ చేసినా సినిమాను దెబ్బతీయలేరని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్న మాట. అంతేకాకుండా తామెప్పుడైనా బాలకృష్ణ సినిమాలకు మద్దతు ఇవ్వాలని జనసేన నాయకులను, కార్యకర్తలను అడిగామా? అంటు రివర్స్ లో ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ సినిమా ప్రచారం విషయంతోపాటు మరో అంశాన్ని టీడీపీ పార్టీ శ్రేణులు తెర పైకి తెచ్చారు. ఆంధ్రలో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ.. చంద్రబాబు హోం బ్రాండ్ హెరిటేజ్ ఉత్పత్తులు వాడాలని ప్రభుత్వం తరఫున జీవో పాస్ చేయాలని కోరుతున్నారు. హెరిటేజ్ కు జనసైనికులు మద్దతు ఇస్తే, తామూ హరి హర వీర మల్లు సినిమాకు సపోర్ట్ చేస్తామనేలా ఈ ప్రచారం సాగుతోంది.
దీంతో జనసేన క్యాడర్ సందిగ్ధంలో పడింది. ఈ వ్యవహారంలో ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందులు పడుతోంది. టీడీపీ- జనసేన కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో ఇలా వార్ చేస్తున్నారు.
