Begin typing your search above and press return to search.

వీరమల్లు.. అదే ఉత్తమం

హరిహర వీరమల్లు అనే సినిమాను ప్రకటించి ఆరేళ్లు కావస్తోంది. మొదలైనపుడు, ఆ తర్వాత టీజర్ రిలీజైనపుడు ఈ సినిమాకు మామూలు హైప్ లేదు

By:  Tupaki Desk   |   17 Jun 2025 8:30 AM IST
వీరమల్లు.. అదే ఉత్తమం
X

హరిహర వీరమల్లు అనే సినిమాను ప్రకటించి ఆరేళ్లు కావస్తోంది. మొదలైనపుడు, ఆ తర్వాత టీజర్ రిలీజైనపుడు ఈ సినిమాకు మామూలు హైప్ లేదు. పవన్ కళ్యాణ్ పొటెన్షియాలిటీని సరిగ్గా వాడుకుంటున్నట్లు కనిపించిన ఈ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత కరోనా సహా ఊహించిన పరిణామాలతో సినిమా బాగా ఆలస్యం అయిపోయింది. దీన్నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నాడు. తర్వాత కూడా షూట్ సవ్యంగా సాగలేదు. అతి కష్టం మీద గత నెలలో చిత్రీకరణ పూర్తి చేసినా.. రిలీజ్ మాత్రం కుదరడం లేదు. జూన్ 12న పక్కా అనుకుంటే.. ఆ డేట్ కూడా దాటిపోయింది. కొత్త డేట్‌ను ప్రకటించడం లేదు. రోజులు గడిచిపోతున్నాయి. సినిమాకు ఉన్న క్రేజ్ కూడా పోతోంది. క్రమంగా పవన్ ఫ్యాన్స్ సినిమా మీద ఆశలు వదులుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

జూన్ 12న సినిమా రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు వినిపించాయి. ఒకటి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం, ఇంకోటి బిజినెస్ జరక్కపోవడం. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొన్ని రోజుల్లో అవగొట్టొచ్చు. అది సమస్య కాదు. దాని మీద ఒక అంచనాతో కొత్త డేట్ ఇవ్వొచ్చు. కానీ బిజినెస్ సంగతే ఎటూ తేలట్లేదని తెలుస్తోంది. ప్రధాన సమస్య అదే అంటున్నారు. సినిమా బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ తడిసిమోపెడైంది. నాన్ థియేట్రికల్ డీల్ ఆల్రెడీ పూర్తయింది. కానీ డేట్ మారడం వల్ల అందులో కోత పడుతున్నట్లు తెలుస్తోంది. దాని సంగతి పక్కన పెడితే.. థియేట్రికల్ హక్కులను భారీ రేటుకు అమ్మడం ద్వారా పెట్టుబడిని రాబట్టుకోవాలని రత్నం, దయాకర్ రెడ్డి చూస్తున్నారు. కానీ ఆ రేట్లు బయ్యర్లకు షాక్ కొడుతున్నాయి. అసలే సినిమాకు క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. ఆలస్యం, దర్శకుడు మారడం లాంటి కారణాలతో కంటెంట్ మీద నమ్మకాలూ తక్కువే. అలాంటపుడు నిర్మాత చెబుతున్న రేట్లు అస్సలు వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. మాంచి క్రేజ్ ఉన్న ‘ఓజీ’ని మించి ‘వీరమల్లు’కు రేట్లు చెబుతున్నారు.

ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అయినా అంతంత రేట్లు పెట్టి సినిమాను కొనడం అంటే చాలా కష్టం అనుకుంటున్నారు బయ్యర్లు. తాము కోరుకున్న రేట్లు వస్తే తప్ప సినిమాను ఇవ్వొద్దని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో వ్యవహారం ఎంతకీ తెగట్లేదు. లాభాలు రాకపోయినా.. కనీసం పెట్టుబడిని రాబట్టుకోవాలన్న నిర్మాతల ఆలోచన కరెక్టే. కానీ పరిస్థితులు బాగా లేని నేపథ్యంలో బయ్యర్ల కోణాన్ని కూడా వాళ్లు విస్మరించకూడదు. ఈ ఆలస్యం వల్ల సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గిపోయి.. ఇంకా రేట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఆలస్యం చేస్తూ పోతే రేప్పొద్దున సినిమాకు ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమవుతుంది. ఉన్నంతలో తక్కువ నష్టంతో బయటపడడమే ఉత్తమం అనుకుని.. రీజనబుల్ రేట్లకు సినిమాను అమ్మేయడం మంచిదనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.