'పుష్ప' తర్వాత మళ్లీ 'వీరమల్లు'కే
ఇటు తెలంగాణలో, అటు ఏపీలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు ఈజీగా అనుమతులు రావడం మొదలైంది.
By: Tupaki Desk | 20 July 2025 9:32 AM ISTఇటు తెలంగాణలో, అటు ఏపీలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు ఈజీగా అనుమతులు రావడం మొదలైంది. కానీ తెలంగాణలో అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ‘పుష్ఫ’ చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన విషాదంతో పరిస్థితులు మారిపోయాయి. బెనిఫిట్ షోలకు తెరపడింది. అదనపు రేట్లకూ అనుమతులు రావట్లేదు. ఏపీలో మాత్రం ఏ సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవాలన్నా, అదనపు రేట్లు కావాాలన్నా ఇబ్బంది లేకుండా అనుమతులు వచ్చేస్తున్నాయి.
తెలంగాణలో మళ్లీ పూర్వపు పరిస్థితుల కోసం అగ్ర నిర్మాత దిల్ రాజు సహా కొందరు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. ఐతే రాజు వల్ల కానిది ఏఎం రత్నం సాధించేశాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే వారం విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి తాజా ప్రెస్ మీట్లో రత్నం.. తెలంగాణలోనూ బెనిఫిట్ షోలు వేయడంపై ధీమాగా మాట్లాడారు.
‘హరిహర వీరమల్లు’ బెనిఫిట్ షోల కోసం అభిమానుల నుంచి బాగా ప్రెజర్ ఉందని.. ఈ సినిమాకు ముందు రోజు రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.30కి బెనిఫిట్ షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నామని రత్నం వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈ షోలకు అనుమతులు కూడా వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. తెలంగాణలోనూ ముందు రోజు బెనిఫిట్ షోలు ఉంటాయని రత్నం అంత ధీమాగా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘పుష్ప-2’ అనుభవం తర్వాత టాలీవుడ్ నిర్మాతలు బెనిఫిట్ షోలు, అదనపు రేట్ల కోసం ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఖరాఖండిగా చెప్పేయడంతో నిర్మాతలు ఆశలు వదులుకున్నారు.
అందుకే దరఖాస్తులు కూడా పెట్టట్లేదు. ఐతే రత్నం మాత్రం జూన్ 12న సినిమా రిలీజ్ అనుకున్నపుడే ముందుగా వెళ్లి సీఎం రేవంత్‌ను కలిసి వచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా కావడం, భారీ బడ్జెట్ పెట్టడంతో.. బెనిఫిట్ షోలు, అదనపు రేట్ల కోసం రత్నం చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారా.. ఇన్నాళ్ల పంతం వదిలి ఈ సినిమాకు షోలు, రేట్ల కోసం అనుమతులు ఇచ్చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే.. మున్ముందు వచ్చే పెద్ద సినిమాలకూ ఈ సౌలభ్యం దక్కుతుందన్నమాటే.
