బయ్యర్స్ అలా అడగడం కామన్.. పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయ్: వీరమల్లు నిర్మాత
ప్రస్తుతం రోజుల్లో మనం తప్పులు వెతకడానికే సినిమా చూస్తున్నామని, దయచేసి తప్పులు వెతకడానికే ఎవరూ చూడొద్దని కోరారు.
By: Tupaki Desk | 19 July 2025 12:50 PM ISTసీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా.. జులై 25న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనుంది.
అయితే రిలీజ్ కు ఇంకా తక్కువ సమయమే ఉన్నా.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. నిర్మాత డిమాండ్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ అసంతృప్తిగా ఉన్నారని.. కొన్ని చోట్ల ఇంకా బిజినెస్ కూడా అవ్వలేదని ప్రచారం జరుగుతోంది. వాటితోపాటు పలు పుకార్లు స్ప్రెడ్ అవ్వడంతో నిర్మాత మీడియాతో మాట్లాడారు.
ఆ సమయంలో.. జనవరి నుంచి సినీ ఇండస్ట్రీ డ్రైగా ఉందని వ్యాఖ్యానించారు నిర్మాత రత్నం. తమ సినిమా చాలా రోజులపాటు సెట్స్ పై ఉండిపోయిందని, దాన్ని ఓ అవకాశంగా తీసుకుని బయ్యర్లు తక్కువ రేట్ కు అడగడం కామన్ అని తెలిపారు. సినిమా విడుదల అయ్యాక అంతా చూసి శభాష్ రత్నం అని అంటారని చెప్పారు.
ప్రస్తుతం రోజుల్లో మనం తప్పులు వెతకడానికే సినిమా చూస్తున్నామని, దయచేసి తప్పులు వెతకడానికే ఎవరూ చూడొద్దని కోరారు. తాము వీరమల్లు సినిమాను ప్రేక్షకుల కోసం తీశామని, అందుకే దాన్ని ఆస్వాదించండని అన్నారు. వీరమల్లు చిత్రానికి పవన్ గారు ఇచ్చిన మద్దతు అపారమైనదని కొనియాడారు. ఆయన బిజీగా ఉన్నారని తెలిపారు.
ఆయన పనిచేస్తున్న ఇతర రెండు ప్రాజెక్టుల కంటే ఈ చిత్రానికి ఎక్కువ డేట్స్ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఇతర కమిట్మెంట్ లతో పూర్తిగా బిజీగా ఉన్నందున, హిందీలో లేదా ఇతర భాషలలో సినిమాను ప్రమోట్ చేయడానికి అందుబాటులో లేరని తెలిపారు. బాలీవుడ్ లో ఈవెంట్ నిర్వహించేందుకు అవకాశాలు తక్కువ ఉన్నాయని పేర్కొన్నారు.
తానే వెళ్లి ఓ ప్రెస్ మీట్ పెడదామని అనుకుంటున్నట్లు తెలిపారు. అత్యున్నత నాణ్యతతో భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించామని, కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ టిక్కెట్ల ధరను పెంచాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రేట్లు పెంచేందుకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నట్లు వెల్లడించారు.
"మొదటి రోజే ప్రజలు సినిమా చూడాలని మేం ఎప్పుడూ డిమాండ్ చేయడం లేదు. దయచేసి సినిమాను సామాన్య ప్రేక్షకులకు సుదూర కలగా మారుస్తున్నామని చెప్పకండి. మూవీని నిర్మించడానికి చాలా కష్టపడ్డాం. అందుకే తక్కువ ధరకు అమ్మలేం. ప్రజలు దానిని అర్థం చేసుకోవాలి" అని నిర్మాత ఏఎం రత్నం కోరారు.
