Begin typing your search above and press return to search.

హ‌న్సిక‌పై 498-A కేసు.. చివ‌రికిలా!

అయితే మార్చి 24న హ‌న్సిక‌ మోత్వానీ హైకోర్టులో క్వాష్ వేసారు. దీనిపై బాంబే హైకోర్టు నోటీసు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   3 April 2025 8:38 PM IST
హ‌న్సిక‌పై 498-A కేసు.. చివ‌రికిలా!
X

ప్ర‌ముఖ క‌థానాయిక హ‌న్సిక మోత్వానీ ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. త‌న‌పై సోద‌రుని భార్య(వ‌దిన‌) 489ఏ కేసును భ‌నాయించ‌గా, దీనిపై క్వాష్ కోరుతూ హ‌న్సిక హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వదిన ముస్కాన్ నాన్సీ జేమ్స్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ హ‌న్సిక‌ బాంబే హైకోర్టును అభ్య‌ర్థించారు. తాను అన్నా వ‌దిన‌ల‌కు దూరంగా త‌న భ‌ర్త‌తో క‌లిసి జీవిస్తున్నాన‌ని హ‌న్సిక త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

ఫిర్యాదు ప్రకారం.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ- జేమ్స్ దంప‌తుల మ‌ధ్య చాలా కాలంగా క‌ల‌త‌లు ఉన్నాయి. ఈ జంట మ‌ధ్య హ‌న్సిక‌, ఆమె త‌ల్లి జోక్యం కార‌ణంగానే క‌ల‌తలు చెల‌రేగి బ్రేక‌ప్ అయింద‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అయితే మార్చి 24న హ‌న్సిక‌ మోత్వానీ హైకోర్టులో క్వాష్ వేసారు. దీనిపై బాంబే హైకోర్టు నోటీసు జారీ చేసింది.

2020లో ప్రశాంత్‌ను వివాహం చేసుకున్న బుల్లితెర న‌టి జేమ్స్ 2022 నుండి అత‌డికి దూరంగా నివ‌శిస్తోంది. త‌న‌పై భర్త గృహ హింసకు పాల్పడ్డాడని దీని కార‌ణంగా బెల్స్ పాల్సీ (పాక్షిక ముఖ పక్షవాతం)తో ముప్పు ఎదురైంద‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. అలాగే రోకా, వివాహ వేడుకల సమయంలో మోత్వానీ కుటుంబీకులు ఖ‌రీదైన‌ బహుమతులు డిమాండ్ చేశార‌ని, ఉదయపూర్‌లోని వివాహ వేదిక కోసం రూ.20 లక్షలు చెల్లించడానికి తన ఫ్లాట్‌ను అమ్మమని భ‌ర్త ప్ర‌శాంత్ మోత్వానీ ఒత్తిడి చేశాడని FIR లో జేమ్స్ ఆరోపించింది.

అయితే తన పిటిషన్‌లో హ‌న్సిక‌ మోత్వానీ అన్ని ఆరోపణలను ఖండించింది. తన అన్న వ‌దిన‌ల మ‌ధ్య వివాదం 2021 నుండి కొనసాగుతోందని.. పరస్పర విడాకుల చర్చల ద్వారా 2022లో స‌మ‌స్య ప‌రిష్కారం అయింద‌ని హ‌న్సిక మోత్వానీ త‌న పిటిష‌న్ లో పేర్కొంది. త‌న‌తోనే ఉంటూ కాల్షీట్లు చూస్తున్న త‌న త‌ల్లి ప‌రువు కూడా వ‌దిన తీస్తోంద‌ని హ‌న్షిక ప్ర‌త్యారోప‌ణ‌లు చేసారు. తాను 2022లో వివాహం చేసుకుని అదే ఏడాది నుంచి తన భర్తతో నివసిస్తున్నానని హ‌న్షిక పేర్కొంది. త‌న అన్నావ‌దిన‌ల‌కు తాను దూరంగా ఉన్నానని కూడా క్వాష్ పిటిష‌న్ లో వివ‌రించింది.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 498-A (ఒక మహిళపై క్రూరత్వం), 323 (గాయపరచడం), 504 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) , 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద మోత్వానీల‌పై ఎఫ్.ఐ.ఆర్ దాఖలైంది. ఇంత‌కుముందే హ‌న్సిక‌ మోత్వానీ ముంబై సెషన్స్ కోర్టు నుండి ముందస్తు అరెస్టు బెయిల్ పొందారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హ‌న్షిక త‌మిళ హార‌ర్ చిత్రం `గార్డియన్‌`లో న‌టించారు.