Begin typing your search above and press return to search.

దిగజారిపోకండి.. ట్రోల‌ర్ల‌పై జీవీ ప్రకాష్ అస‌హ‌నం!!

ప్రేమించి పెళ్లాడిన జంట విడిపోవ‌డంతో అభిమానులు తీవ్రంగా క‌ల‌త‌కు గుర‌య్యారు. కొంద‌రు జీవీ ప్ర‌కాష్ పై తీవ్రంగా ట్రోలింగ్ చేసారు.

By:  Tupaki Desk   |   16 May 2024 5:00 AM GMT
దిగజారిపోకండి.. ట్రోల‌ర్ల‌పై జీవీ ప్రకాష్ అస‌హ‌నం!!
X

సంగీత స్వరకర్త, నటుడు జివి ప్రకాష్ కుమార్ ఇటీవల తన భార్య, గాయని సైంధవి నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రేమించి పెళ్లాడిన జంట విడిపోవ‌డంతో అభిమానులు తీవ్రంగా క‌ల‌త‌కు గుర‌య్యారు. కొంద‌రు జీవీ ప్ర‌కాష్ పై తీవ్రంగా ట్రోలింగ్ చేసారు. అయితే త‌న‌పై విమ‌ర్శ‌లు, ట్రోలింగుకి ప్రతిస్పందిస్తూ జీవీ ప్ర‌కాష్‌ బలమైన పదాలతో కూడిన ప్రకటనను విడుదల చేశాడు.

గ‌త రెండు రోజులుగా విడాకుల‌లో అత‌డి పాత్రను ప్రశ్నించిన ట్రోల‌ర్ల‌కు స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. బ్రేక‌ప్ అనేది పరస్పర అంగీకారంతోనే జ‌రిగింద‌ని, అనవసరమైన ఊహాగానాలతో త‌న‌ను బాధపెడుతున్నార‌ని జీవీ ప్ర‌కాష్ అన్నారు. ఇద్దరు వ్యక్తుల కలయిక లేదా విడిపోవ‌డం గురించి సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం నిరుత్సాహపరుస్తుంది. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు. గౌరవం ఎంతగా దిగజారిపోయిందంటే.. ట్రోల‌ర్ల‌ వ్యాఖ్యలు ఎంత‌గా బాధపెడతాయో గ్రహించలేక‌పోతున్నారు! అని అన్నారు.

విడిపోవడానికి గల కారణాలు త‌మ‌ కుటుంబాలు, ప్రియమైన వారికి తెలుసునని, ''మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసాం. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. ఇవేవీ తెలియ‌కుండా మీ వ్యాఖ్యలు బాధ కలిగించేవిగా ఉన్నాయని తెలియజేయడానికి నేను దీన్ని వ్రాస్తున్నాను. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. మ‌ద్ధ‌తునిచ్చిన‌ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అని రాసారు.

జీవీ ప్రకాష్ -సైంధవి 11 సంవత్సరాల క్రితం ( 2013) వివాహం చేసుకున్నారు. 2020 లో అన్వి అనే పాపకు స్వాగతం పలికారు. ఈ ఏడాది మే 13న ప్రకాష్ - సైంధవి తమ సోషల్ మీడియాలో విడాకుల‌ ప్రకటనను షేర్ చేసారు. వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ మానసిక ప్రశాంతత , మెరుగుదల కోసం విడిపోతున్నట్లు వారు పేర్కొన్నారు. ప‌ర‌స్ప‌ర నిర్ణ‌యాన్ని గౌర‌వించి మాకు మీ మ‌ద్ధ‌తును ఇస్తార‌ని ఆశిస్తున్నామ‌ని తెలిపారు.

సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ అక్క అయిన ప్లేబ్యాక్ సింగర్ ఎఆర్ రెహనా- జి వెంకటేష్ ల ఏకైక కుమారుడు ప్రకాష్. గాయకుడిగా కెరీర్ ప్రారంభించి, తర్వాత స్వరకర్తగా మారాడు. ఆ త‌ర్వాత‌ నటనలోకి కూడా అడుగుపెట్టాడు. జీవీప్రకాష్ తంగలన్, ఎమర్జెన్సీ, సర్ఫీరా, లక్కీ బాస్కర్ వంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా డియర్‌లో అత‌డు నటించాడు.