జీవితాంతం రంగస్థలంపైనే గడిపాడు!
జీవీ బాబు ఇక లేరు అనేది జీర్ణించుకోలేనిది.. ఆయన తన జీవితాంతం థియేటర్ రంగంలోనే గడిపారు.
By: Tupaki Desk | 25 May 2025 1:40 PM ISTతెలుగు నటుడు, బలగం ఫేం జీవీ బాబు ఈరోజు (25మే) మరణించారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. వరంగల్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అనారోగ్యం తిరగబెట్టడంతో తుది శ్వాస విడిచారు. జీవీ బాబు చివరిసారిగా తెలుగు చిత్రం బలగంలో కనిపించారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే, చిత్ర దర్శకుడు వేణు యెల్దండి తన ఎక్స్ హ్యాండిల్‌లో ఉద్విగ్నతతో స్పందించారు. బాబు ప్రతిభను కీర్తిస్తూ, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.
జీవీ బాబు ఇక లేరు అనేది జీర్ణించుకోలేనిది.. ఆయన తన జీవితాంతం థియేటర్ రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బాలగం ద్వారా పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దర్శకనటుడు వేణు యెల్దండి ఎక్స్ లో రాసారు.
తెలుగు ఫ్యామిలీ డ్రామా బలగం 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు, కమర్షియల్ గాను విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, జివి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణ గ్రామం నేపథ్యంలో కొమురయ్య అనే వృద్ధుడి మరణం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. కొమరయ్య మరణం అతడి కుటుంబంలోని ఘర్షణలను, ఎమోషన్స్ ని ఆవిష్కరిస్తూ, నేటి సామాజిక సంక్షోభాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది.
అతడి మరణానంతరం ఉద్రిక్తతలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి? అన్నది ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా దూరంగా ఉన్న కొమురయ్య అల్లుళ్ల మధ్య గొడవలు, వివాదాలు, అంత్యక్రియలు, దెబ్బతిన్న మానవ సంబంధాలు, వ్యక్తిగత అజెండాలను ఈ సినిమాలో యథాతథంగా ప్రదర్శించారు. కొమరయ్య అంత్యక్రియల కోసం చివరికి పంచాయితీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ సినిమాను వేణు యెల్దండి ఎంతో ఉద్విగ్నత, ఆర్ద్రతతో రూపొందించి ప్రశంసలు అందుకున్నారు.
