'గుర్రం పాపిరెడ్డి' మూవీ రివ్యూ
ఈ కోవలో గుర్రం పాపిరెడ్డి కూడా చేరుతుందనే అంచనాలు కలిగాయి ట్రైలర్ చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
By: Tupaki Desk | 19 Dec 2025 9:16 PM ISTనటీనటులు: నరేష్ అగస్త్య - ఫరియా అబ్దుల్లా - రాజ్ కుమార్ కసిరెడ్డి - బ్రహ్మానందం - జీవన్ - జాన్ విజయ్ - వంశీ - ప్రభాస్ శీను తదితరులు
సంగీతం: కృష్ణ సౌరభ్
ఛాయాగ్రహణం: అర్జున్ రాజా
కథ: పూర్ణ ప్రజ్ఞ
మాటలు: నిరంజన్
నిర్మాతలు: వేణు సద్ది - అమర్ బూర - జయకాంత్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మురళి మనోహర్
ఈ ఏడాది తెలుగులో చిన్న సినిమాలు చాలానే బాక్సాఫీస్ దగ్గర జయకేతనం ఎగుర వేశాయి. ఈ కోవలో గుర్రం పాపిరెడ్డి కూడా చేరుతుందనే అంచనాలు కలిగాయి ట్రైలర్ చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ: గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య)కి భారీగా డబ్బు సంపాదించాలని ఆశ. అతను ప్లాన్ చేసిన ఒక బ్యాంకు రాబరీ ఫెయిల్ అయి జైలు పాలవుతాడు. జైలు నుంచి బయటికి వచ్చాక సౌధమిని (ఫరియా అబ్దుల్లా) తో కలిసి డబ్బు కోసం ఇంకా పెద్ద ప్లాన్ వేస్తాడు. ఇంతకుముందు రాబరీకి ప్రయత్నించిన గ్యాంగ్ తోనే ఈ ప్లాన్ కూడా అమల్లో పెడతాడు. దీని ప్రకారం శ్రీశైలం నుంచి ఒక శవాన్ని బయటికి తీసి హైదరాబాద్ లో ఉన్న ఒక శ్మశానంలో ఒక శవం స్థానంలో పాతి పెడతారు. ఇలా శవాల మార్పిడికి కారణం ఏంటి? దీని వెనుక పాపిరెడ్డి ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ ఫలించి అతడి గ్యాంగ్ డబ్బులు సంపాదించిందా? ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ: వెండితెరపై కామెడీ పండించడం పెద్ద సవాలుగా మారిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పట్లా తెలుగులో ఇప్పుడు బోలెడంతమంది కమెడియన్లు లేరు. అప్పట్లా క్లీన్ కామెడీ రాసే రైటర్లూ తగ్గిపోయారు. ఆ తరహా కామెడీ ఇప్పుడు వర్కవుట్ అవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏదైనా క్రైమ్ ఎలిమెంట్ నేపథ్యంలో క్రేజీ ఐడియా తీసుకోవడం.. దాని మీద లౌడ్ గా కామెడీ ట్రై చేయడం.. క్యారెక్టర్లన్నీ విపరీతమైన హడావుడి చేస్తూ.. అల్లరల్లరి చేస్తూ నవ్వించే ప్రయత్నం చేయడం.. ఈ స్టయిల్లో కామెడీ సినిమాలు ట్రై చేస్తున్నారు ఈ తరం దర్శకులు. కానీ కామెడీలో ఈ లౌడ్నెస్ ఓవర్ డోస్ అయితే.. మొత్తంగా వంటకమే చెడిపోయే ప్రమాదం ఉంటుంది. గుర్రం పాపిరెడ్డిలో కూడా అలాగే జరిగింది. ఇందులో కామెడీ లేదని కాదు.. నవ్వులు పండలేదనీ కాదు.. అక్కడక్కడా పంచులు పేలాయి.. కామెడీ సిచువేషన్లు వర్కవుట్ అయ్యాయి. కానీ కన్సిస్టెన్సీ లేక.. చాలా సీన్లు సిల్లీగా తయారై కామెడీ అనుకున్నంతగా పండలేదు.
క్రైమ్ కామెడీ జానర్లో సినిమాలంటే ప్రధానంగా కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఒక చోట భారీ మొత్తంలో ఉన్న డబ్బు లేదా ఆస్తిని చేజిక్కించుకోవడానికి ఒక గ్యాంగ్ ట్రై చేయడం.. ఈ క్రమంలో ప్రణాళికలు అటు ఇటు అయి గందరగోళం నెలకొనడం.. ఈ క్రమంలో కామెడీ పండించడానికి ప్రయత్నిస్తారు. ఇదే స్టయిల్లో నడిచే గుర్రం పాపిరెడ్డిలో ప్లాట్ పాయింట్ అయితే ఆసక్తికరంగా అనిపిస్తుంది. స్వాతంత్ర్యానికి పూర్వం సంస్థానాల చుట్టూ క్రేజీ ఐడియాతో కథ అల్లాడు రచయిత. వారసుడు లేకుండా పోయిన ఒక సంస్థానానికి హీరో బృందం నుంచి ఒక ఫేక్ వారసుడిని తయారుచేసి.. అతడికి ఆస్తి దక్కేందుకు వీళ్లు వేసే ప్లాన్ భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే శవాల మార్పిడి ఐడియా క్రేజీగా అనిపిస్తుంది. ఐతే దీని మీద ఆర్గానిక్ కామెడీ పండించడానికి అవకాశం ఉన్నప్పటికీ.. షార్ప్ రైటింగ్.. కొత్తదనం లోపించడం వల్ల ఆ సీన్లలో అనుకున్నంతగా నవ్వులు పండలేదు. రాజ్ కుమార్ కసిరెడ్డి.. వంశీ రూపంలో ప్రస్తుత ట్రెండుకు తగ్గ కమెడియన్లు కొంతమేర నవ్వించగలిగినా.. డోస్ సరిపోలేదు.
బ్రహ్మానందం జడ్జిగా కోర్ట్ రూంలో నడిపిన కామెడీ అంతా జాతిరత్నాలు సీక్వెన్సును గుర్తు చేస్తుంది. బ్రహ్మి పంచులు కొన్ని బాగానే పేలాయి. కానీ కోర్టు సీన్లు మరీ సిల్లీగా ఉండడం వల్ల ద్వితీయార్ధంలో విసుగు పుడుతుంది. కథలో మలుపులు ఉన్నప్పటికీ.. వాటిని తెరపై సరిగా ప్రెజెంట్ చేయలేదు. తమిళ కమెడియన్ మొట్ట రాజేంద్రన్ చుట్టూ నడిపిన కామెడీ విసుగు పుట్టిస్తుంది. అది పూర్తిగా సినిమాకు అవసరం లేని ట్రాక్ లా అనిపిస్తుంది. మొదట్లో యోగిబాబును పెట్టి చేసిన కామెడీ ట్రాక్ కూడా సరిగా పేలలేదు. వందల కోట్ల ఆస్తి అన్నాక ఎంతో కొంత సీరియస్నెస్ ఉండాలి. దాని చుట్టూ డ్రామాను పండించే అవకాశం ఉన్నా పెద్దగా ఉపయోగించుకోలేదు. కథలో కీలక మలుపులు చోటు చేసుకునే సందర్భంలోనూ సిల్లీగా.. మరీ లౌడ్ గా సన్నివేశాలను నడిపించడంతో గుర్రం పాపిరెడ్డి అనుకున్నంత కిక్కు ఇవ్వదు. ప్రథమార్ధంలో తొలి అరగంట తర్వాత.. ద్వితీయార్ధంలో చివరి అరగంట పర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఓకే. కానీ ఇలాంటి క్రైమ్ కామెడీల్లో నిడివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ గుర్రం పాపిరెడ్డిని మాత్రం 2 గంటల 40 నిమిషాల సుదీర్ఘ నిడివితో రూపొందించారు. అందులో చాలా వరకు అనవసర ఎపిసోడ్లు ఉండడం.. కామెడీ కొన్ని చోట్లే వర్కవుట్ కావడం... విషయం తక్కువ హడావుడి ఎక్కువ అయిపోవడంతో గుర్రం పాపిరెడ్డి ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది.
నటీనటులు: నరేష్ అగస్త్యలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. కొన్ని సన్నివేశాల్లో అది కనిపిస్తుంది. తన పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ.. లీడ్ రోల్ భారాన్ని అతను మోయలేక పోయాడు. టైటిల్ గా హీరో పేరు పెట్టారు కానీ అందుకు తగ్గట్లుగా ఆ పాత్రకు వెయిట్ ఇవ్వలేదు. సౌధమినిగా ఫరియా అబ్దుల్లా బాగానే చేసింది. తన గ్లామర్ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. కానీ ఆ పాత్ర కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. ఫరియా టాలెంటుకు తగ్గ పాత్ర అయితే కాదిది. రాజ్ కుమార్ కసిరెడ్డి సినిమాలో అత్యధిక ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అతడి జోడిగా వంశీ కూడా బాగానే కామెడీ పండించాడు. కథలో కీలకమైన పాత్రలో జీవన్ ఆకట్టుకున్నాడు. అమాయకత్వంతో నవ్వులు పంచాడు. బ్రహ్మి జడ్జి పాత్రలో కొన్నిచోట్ల నవ్వించాడు. తమిళ కమెడియన్లు యోగిబాబు.. మొట్ట రాజేంద్రన్ వల్ల సినిమాకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. జాన్ విజయ్ గురించి చెప్పడానికి ఏమి లేదు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా గుర్రం పాపిరెడ్డి ఒక మోస్తరుగా అనిపిస్తుంది. కృష్ణ సౌరభ్ పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం బాగానే సాగింది. అర్జున్ రాజా ఛాయాగ్రహణం మాములుగా సాగింది. నిర్మాణ విలువలకు ఏమి ఢోకా లేదు. పెద్ద కాస్టింగ్ పెట్టుకుని.. రకరకాల లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. బాగానే ఖర్చు పెట్టిన సంగతి తెరపై కనిపిస్తుంది. కానీ రైటింగ్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. పూర్ణ ప్రజ్ఞ ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగున్నా.. స్క్రీన్ ప్లేలో బిగి కొరవడింది. నిరంజన్ మాటలు కొన్ని పేలాయి. దర్శకుడు మురళీ మనోహర్ టేకింగ్ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. కొన్ని చోట్ల కామెడీని బాగానే డీల్ చేసినా.. కామెడీ కోసం సన్నివేశాలను మరీ లౌడ్ గా ప్రెజెంట్ చెయ్యడంతో సినిమా గోల గోలగా అనిపిస్తుంది.
చివరగా: గుర్రం పాపిరెడ్డి.. నవ్వులు తక్కువ గోల ఎక్కువ
రేటింగ్- 2.25/5
