ఇకపై ఎలాంటి గ్యాప్ ఉండదు.. నా టార్గెట్ అదే!
అప్పుడెప్పుడో రుద్రమదేవి సినిమా తర్వాత ఆయన్నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమా ఒకటే. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ నుంచి శాకుంతలం అనే సినిమా మాత్రమే వచ్చింది.
By: Tupaki Desk | 30 Jan 2026 12:00 AM ISTగుణశేఖర్. తెలుగు సినీ ప్రియుల్లో ఆయన పేరు తెలియని వారుండరు. ఎలాంటి జానర్ సినిమాలనైనా తనదైన శైలిలో తెరకెక్కించి తన మార్క్ చూపించగల డైరెక్టర్ గుణశేఖర్. ఆయన నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. అలా అని ఆయన ఖాతాలో ఫ్లాపులు లేవని కాదు. ఆయనెలాంటి సినిమా తీసినా అందులో తన మార్క్ తప్పనిసరిగా ఉంటుంది.
రుద్రమదేవి తర్వాత 8 ఏళ్లకు శాకుంతలం
అలాంటి డైరెక్టర్ గత కొన్నేళ్లుగా సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. అప్పుడెప్పుడో రుద్రమదేవి సినిమా తర్వాత ఆయన్నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమా ఒకటే. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ నుంచి శాకుంతలం అనే సినిమా మాత్రమే వచ్చింది. శాకుంతలం తర్వాత ఇప్పుడు మరో మూడేళ్లకు మరో సినిమా వస్తోంది. అదే యుఫోరియా.
ఫిబ్రవరి 6న యుఫోరియా రిలీజ్
భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన యుఫోరియా ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న గుణ శేఖర్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఈ సినిమా చాలా కొత్త కాన్సెప్ట్ తో రూపొందిందని, యూత్ కు, ఫ్యామిలీ ఆడియన్స్ కు యుఫోరియా తప్పక నచ్చుతుందని ధీమాగా చెప్తున్నారు.
టైమ్ వేస్ట్ చేశాను
యుఫోరియా ప్రమోషన్స్ లో తన కెరీర్లో వచ్చిన గ్యాప్ గురించి కూడా గుణశేఖర్ మాట్లాడారు. రుద్రమదేవి తర్వాత తాను హిరణ్య కశ్యప మూవీ చేద్దామనుకున్నానని, 33 ఏళ్ల కెరీర్లో తన కెరీర్లో ఈ సినిమా కోసం దాదాపు 8 ఏళ్ల టైమ్ ను వేస్ట్ చేశానని, తీయని సినిమా కోసం ఇన్నేళ్లు వృధా చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నేళ్ల పాటూ సినిమాలకు దూరంగా ఉండటం వల్ల ఎంతో విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇకపై సినిమాలపైనే ఫుల్ ఫోకస్..
అయితే ఇకపై తన కెరీర్లో ఎలాంటి గ్యాప్ ఉండదని, ఇప్పుడు తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని, రెగ్యులర్ గా సినిమాల చేస్తానని, మంచి కంటెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే తన టార్గెట్ అని, గతంతో పోలిస్తే ఇప్పుడు తన ఆలోచనా విధానం కూడా మరింత మెరుగైందని, తన నుంచి రాబోయే ప్రాజెక్టులు మరింత ప్రత్యేకంగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హిరణ్య కశ్యప గురించి మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీ, కథనంతో ఈ ప్రాజెక్టును భారీగా చేయాలనుకుంటున్నానని, ముందు అనుకున్న కథనే మరోవిధంగా చెప్పాలనేది తన ఉద్దేశమని, దానికి భారీ బడ్జెట్ తో పాటూ భారీ టెక్నాలజీ కూడా అవసరమని, అవన్నీ కుదిరినప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని గుణశేఖర్ చెప్పారు.
