38 ఏళ్ల తర్వాత అక్కడ మూవీ ప్రీమియర్..!
ఇండియాలో భాగం అయినప్పటికీ కశ్మీర్ చాలా ప్రత్యేకమైన ప్రాంతం. అక్కడ సినిమాలను స్క్రీనింగ్ చేయడం అనేది చాలా పెద్ద కష్టంగా మారింది.
By: Tupaki Desk | 15 April 2025 1:02 PM ISTఇండియాలో భాగం అయినప్పటికీ కశ్మీర్ చాలా ప్రత్యేకమైన ప్రాంతం. అక్కడ సినిమాలను స్క్రీనింగ్ చేయడం అనేది చాలా పెద్ద కష్టంగా మారింది. శ్రీనగర్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాలకు రెడ్ కార్పెట్ ప్రీమియర్‌లు నిర్వహించడం సాధ్యం అయ్యే పని కాదు. చాలా ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో 'గ్రౌండ్ జీరో' సినిమా స్క్రీనింగ్‌కి రెడీ అయింది. 38 ఏళ్ల తర్వాత మొదటి సారి శ్రీనగర్‌లో సినిమాకు సంబంధించిన స్క్రీనింగ్ జరగబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. గ్రౌండ్ జీరో సినిమాను భారత సైన్యం, బీఎస్‌ఎఫ్ దళాలకు అంకితం చేస్తూ ఈ ప్రీమియర్ ఉంటుందని తెలుస్తోంది.
2001 పార్లమెంట్ దాడి తర్వాత బీఎస్‌ఎఫ్ అధికారి నరేంద్ర నాథ్ ధర్ దూబే ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఆపరేషన్‌లో పార్లమెంట్ దాడి సూత్రధారి అయిన ఘాజీ బాబాను అంతమొందించారు. నిజ జీవిత ఘటనలు తీసుకుని, కల్పిత సన్నివేశాలతో సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దేశ వ్యాప్తంగా విడుదలకు ముందే ఈ సినిమాను శ్రీనగర్‌లో స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 18న ఇండియన్ ఆర్మీ కోసం వేయబోతున్న ఈ ప్రీమియర్ కి ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
నరేంద్ర నాథ్ దర్ దూబే కథ ఆధారంగా రూపొందించాలని మొదలు పెట్టిన 'గ్రౌండ్ జీరో' సినిమాలో సల్మాన్ ఖాన్‌ను నటింపజేయాలని భావించారు. కానీ ఆయన అప్పటికే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో పాటు సికిందర్ సినిమాను కమిట్ అయ్యి ఉన్నాడు. రెండేళ్ల వరకు వేచి ఉండమని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ నుంచి సినిమాను ఇమ్రాన్ హస్మీతో రూపొందించారు. దూబే పాత్రలో ఇమ్రాన్ నటించి మెప్పించాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దేశ భక్తి సినిమాలను మెచ్చే వారికి కచ్చితంగా ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. కంటెంట్ బాగున్న కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆధరాభిమానాలను సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా ఫలితం పట్ల కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ దేశ భక్తి కాన్సెప్ట్ కారణంగా కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
