Begin typing your search above and press return to search.

అల్లు ఇంటికి వ‌చ్చి మ‌రీ స‌న్మానించిన హ‌ర్యాణా గ‌వ‌ర్న‌ర్

హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న అల్లూ అర్జున్‌ని అభినందించారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 2:25 PM GMT
అల్లు ఇంటికి వ‌చ్చి మ‌రీ స‌న్మానించిన హ‌ర్యాణా గ‌వ‌ర్న‌ర్
X

పుష్ప రాజ్‌గా తనదైన నటనతో ఉర్రూతలూగించిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు. గ‌డిచిన‌ 68 ఏళ్లలో టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా గెలుపొందిన తొలి తెలుగు నటుడిగా సంచ‌ల‌నం సృష్టించాడు. పుష్ప చిత్రానికి బాణీలు అందించిన దేవీశ్రీ‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకోవ‌డం మ‌రో సెన్సేష‌న్‌. అల్లూ సాధించిన ఘ‌న‌త‌కు సినీ రాజ‌కీయ రంగ‌ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న అల్లూ అర్జున్‌ని అభినందించారు. అతడి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ స్వ‌యంగా అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను స్వ‌యంగా జాతీయ ఉత్త‌మ న‌టుడిని క‌లిసి అభినంద‌న‌లు తెలియ‌జేసిన‌ట్టు వ్యాఖ్య‌ను జోడించారు.

అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా తన నటనతో ప్రేక్షకుల హృదయాల‌ను గెలుచుకున్నాడు. ఈ పాత్ర కోసం బ‌న్ని తీవ్రంగా శ్ర‌మించ‌డ‌మే గాక‌.. లుక్ ప‌రంగా భారీ పరివర్తన చెందాడు. నిజ‌మైన గంధ‌పు చెక్క‌ల‌ స్మ‌గ్ల‌ర్ పుష్ప రాజ్ ఇలానే ఉంటాడా? అనేంత‌గా పాత్ర‌లోకి లీన‌మై న‌టించాడు. అత‌డి న‌డ‌క న‌డ‌త మాట తీరు ప్ర‌తిదీ జాతీయ అవార్డుల జూరీ మ‌న‌సుని గెలుచుకున్నాయి. పుష్ప‌రాజ్‌గా నటన, బాడీ లాంగ్వేజ్.. త‌గ్గేదేలే అంటూ డైలాగ్ లు ప్ర‌తిదీ పుష్ప విజ‌యానికి దోహ‌ద‌ప‌డ్డాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రపంచంలో ఇంతింతై ఎదుగుతూ శత్రువులతో తాడే పేడో తేల్చుకునే ర‌గ్గ్ డ్ కూలీ పుష్ప న‌ట‌న మాస్ ని ఉర్రూత‌లూగించింది. అత‌డి ట్రేడ్ మార్క్ స్టెప్పుల‌కు యువ‌త‌రం ఊగి తూగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెల‌బ్రిటీలు సామాన్యులు అత‌డి ఆహార్యాన్ని స్టెప్పుల‌ను అనుక‌రిస్తూ వీడియోలు చేయ‌డం వాటిని వైర‌ల్ చేయ‌డం మీడియాలో చ‌ర్చ‌గా మారింది. జాతీయ అవార్డును ప్ర‌క‌టించ‌గానే బ‌న్ని దీనికి అర్హుడు అంటూ అంతా ప్ర‌శంస‌లు కురిపించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ న‌టించారు. సమంతా రూత్ ప్రభు ప్రత్యేక పాట ఊ అంటావా యూత్ ని ఒక ఊపు ఊపింది.