గోపీచంద్ - సంకల్ప్.. కంటెంట్ కు తగ్గ టైటిల్
ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ పేరు చాలా ప్రత్యేకమైనది. ఇది కథలోని ఓ ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుందని సమాచారం.
By: Tupaki Desk | 2 July 2025 9:34 AMటాలీవుడ్‌లో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో గోపీచంద్ కు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. యాక్షన్ చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, గత కొంత కాలంగా విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ‘ఘాజీ’, ‘ఐబీ 71’ వంటి చిత్రాలతో నేషనల్ రేంజ్ గుర్తింపు పొందిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై మొదటి నుండి ఆసక్తికరమైన బజ్ నెలకొంది.
ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. చిత్రీకరణను భారీ బడ్జెట్‌తో, నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మేకర్స్ గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. యుద్ధభూమిని తలపించే సెట్‌లో గోపీచంద్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ పేరు చాలా ప్రత్యేకమైనది. ఇది కథలోని ఓ ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుందని సమాచారం. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ కథలో ‘శూల’ అనే ప్రదేశానికి కీలక పాత్ర ఉండనుందని తెలుస్తోంది. అదే కథ నడిపే ప్రధాన ప్లాట్ గా ఉండబోతోంది. డైరెక్టర్ సంకల్ప్ గత చిత్రాల్లో చారిత్రక, జియోపాలిటికల్ అంశాలను ఎలా హైలెట్ చేశారో చూస్తే.. ఈసారి కూడా ఆ స్థాయిలోనే కథను మలచినట్లు స్పష్టమవుతోంది.
గోపీచంద్ లుక్ చూసి నెటిజన్లు ఆయన కెరీర్‌లో ఎప్పుడూ చూడని తరహా పాత్ర అని కామెంట్లు చేస్తున్నారు. ఇక గ్లింప్స్‌లో కనిపించిన మౌంట్ టెర్రెయిన్, గుర్రంపై గోపీచంద్ ఎంట్రీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో కంప్లీట్ చేసిన తర్వాత మేకర్స్ హైదరాబాద్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు.
క్యాస్టింగ్, ఇతర సాంకేతిక విషయాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. సంకల్ప్ రెడ్డి స్టైల్ ప్రకారం, దేశ చరిత్రలో ఓ ప్రత్యేక ఘట్టాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో యూనిక్ అడ్వెంచర్ కావొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గోపీచంద్ కెరీర్‌లో కీలక మలుపుగా నిలవనుంది. విడుదల తేదీతో పాటు టైటిల్‌ను కూడా త్వరలో ప్రకటించే అవకాశముంది.