గోపీచంద్ 33..ఇద్దరికీ విషమ పరీక్షే!
టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్, అండ్ హీమాన్ ఫిజిక్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకరు.
By: Tupaki Desk | 13 Jun 2025 10:30 PMటాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్, అండ్ హీమాన్ ఫిజిక్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. హరీఓగా కెరీర్ ప్రారంభించి మళ్లీ విలన్‌గానూ నటించి ఆకట్టుకున్న గోపీచంద్ ఆ తరువాత కథానాయకుడిగా తన మార్కు సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఇంత టాలెంట్ ఉన్న ఈ హీరో కమర్షియల్ హిట్ మాట విని ఏళ్లవుతోంది. `సీటీమార్`తో ఫరవాలేదు అనిపించుకున్నా కమర్షియల్ బ్లాక్ బస్టర్లని మాత్రం ఇంత వరకు సొంతం చేసుకోలేకపోయాడు.
మారుతిని నమ్మి `పక్కా కమర్షియల్ అన్నా..శ్రీవాసుని నమ్మి రామబాణం వేసినా.. కన్నడ దర్శకుడిపై నమ్మకంతో `భీమా` చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి శ్రీను వైట్ల హిట్టిస్తాడని విశ్వసిస్తే `విశ్వం` అడ్రస్ లేకుండా పోయింది. హిట్ సినిమా చేయాలని, ట్రాక్‌లోకి మళ్లీ రావాలని గోపీచంద్ చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో తను సంకల్ప్‌రెడ్డిని నమ్మి ఓ భారీ యాక్షన్ డ్రామాని చేస్తున్నాడు. `ఘాజీ` సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సంకల్ప్‌రెడ్డి ఆ తరువాత అంతరిక్షం 9000 KMPH, హిందీతో IB71 సినిమాలు చేసి నిరాశపరిచాడు.
ఇప్పుడు హిట్టు కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్‌తో కలిసి ఓ భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టాడు. సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌తో పాటు హీరో లుక్‌ని విడుదల చేశారు. గ్లింప్స్‌లో గోపీచంద్ లుక్, ఆయన మేకోవర్, వారియర్‌గా కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త తరహా కథలకు ప్రాధాన్యతనిచ్చే సంకల్ప్‌రెడ్డి ఈ ప్రాజెక్ట్ కోసం సరికొత్త వారియర్ కథని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. మ్యాచో మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌కి కావాల్సింది ఇలాంటి కథే కావడం, ఆయన గెటప్ కూడా అందుకు తగ్గట్టుగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది.
అయితే చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్‌కు, `ఘాజీ` తరువాత హిట్టు మాట వినని దర్శకుడు సంకల్ప్‌రెడ్డికి ఈ ప్రాజెక్ట్ ఓ విషమ పరీక్ష అని చెప్పక తప్పదు. వీరిద్దరు చాలా కాలంగా సక్సెస్ కోసంఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వారి కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సంకల్ప్‌రెడ్డి, హీరో గోపీచంద్ ఈ ప్రాజెక్ట్‌ని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో తెరపైకి తీసుకురాగలిగితే అనుకున్నట్టుగా ఇద్దరూ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకోవడం ఖాయం.