Begin typing your search above and press return to search.

ఆస్కార్ బరిలో గోంధాల్స్.. గ్లోబల్ వేదికపై భారతీయ సినిమా!

చిత్ర బృందం త్తం పడ్డ కష్టానికి, కథను నమ్మి చేసిన సుదీర్ఘ ప్రయాణానికి లభించిన అత్యుత్తమ ప్రతిఫలంగా అభివర్ణించారు.

By:  Srikanth Kontham   |   19 Sept 2026 8:28 AM IST
ఆస్కార్ బరిలో గోంధాల్స్.. గ్లోబల్ వేదికపై భారతీయ సినిమా!
X

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ బరిలో భారతదేశ అధికారిక ఎంట్రీగా `గోంధాల్` చిత్రం నిలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాంతీయ మట్టివాసనలు, విశిష్ట సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రం గ్లోబల్ వేదికపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుండటం పట్ల దర్శకుడు సంతోష్ దావఖర్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో లభించిన అరుదైన గౌరవం ప్రాంతీయ సినిమా రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని వ్యాఖ్యా నించారు. ఆస్కార్ రేసులో తమ సినిమా పేరు విన్న క్షణంలో మాటలు రాలేదని.. ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.

చిత్ర బృందం త్తం పడ్డ కష్టానికి, కథను నమ్మి చేసిన సుదీర్ఘ ప్రయాణానికి లభించిన అత్యుత్తమ ప్రతిఫలంగా అభివర్ణించారు. భారతదేశం తరఫున ఆస్కార్ ఎంట్రీగా ఎంపికవ్వడం అనేది ఏ దర్శకుడికైనా జీవితకాల కల అని పేర్కొన్నారు. `గోంధాల్` చిత్రం కథాంశం .. తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను, విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంస్కృతి, సాంప్రదాయాలు , మానవ సంబంధాల కలబోతగా రూపొందిన చిత్రం ఒక స్థానిక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని భావోద్వేగాలను ఆవిష్కరించడంలో సంపూర్ణ విజయం సాధించింది.

సినిమా నిర్మాణం , చిత్రీకరణ సమయంలో ఎదురైన సవాళ్లను దర్శకుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పరిమిత వనరులతోనే నాణ్యతతో కూడిన సినిమాను అందించడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు పూర్తి స్థాయిలో సహకరించారన్నారు. ఎక్కడా రాజీ పడకుండా నేటివిటీని కాపాడుతూ చెప్పిన నిజాయితీతో కూడిన కథనమే ఈ విజయానికి మూలస్తంభమని ఉద్ఘాటించారు. దీంతో చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, తోటి దర్శకులు సంతోష్ దావఖర్ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమా జ్యూరీ సభ్యుల మనసు గెలుచుకుని పురస్కారం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

అలాగే ఆస్కార్ ప్రచారం కోసం చిత్ర బృందం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా భారతీయ కళలు, సాంస్కృతిక మూలాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందని, ఆస్కార్ వేదికపై భారతదేశ ఖ్యాతిని సగర్వంగా చాటిచెప్పడానికి తమ వంతు కృషి చేస్తామని సంతోష్ దావఖర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

మొత్తానికి భారీ బడ్జెట్ చిత్రాలు .. స్టార్ డమ్ కాకుండా నిఖార్సయిన మట్టివాసన కలిగిన ప్రాంతీయ కథలకు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గుర్తింపు భారతీయ సినిమాలో వస్తున్న విప్లవాత్మక మార్పుకు అద్దం పడుతోంది. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక మూలాలను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించే కథలు ప్రపంచ ప్రేక్షకులను సైతం మెప్పించగలవని `గోంధాల్` నిరూపిస్తుంది.ఈ చిత్రం ఆస్కార్ తుది నామినేషన్ల రేసులో సత్తా చాటి గ్లోబల్ వేదికపై భారతదేశ కీర్తి పతాకాన్ని మరింత ఎత్తున ఎగురవేయాలని దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.