గొడవలకు ఫుల్‌స్టాప్... అదిరిపోయే బిజినెస్
ఆడియో రైట్స్ ను రూ.9 కోట్లకు గాను టి సిరీస్ దక్కించుకున్న కారణంగా సినిమాపై నమ్మకంతో ఇతర కంపెనీలు సైతం ఈ సినిమా యొక్క రైట్స్ ను భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
By: Ramesh Palla | 1 March 2026 3:00 PM ISTబాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ కమర్షియల్ ప్రాంచైజీలో కొత్త మూవీ రాబోతుంది. ఇప్పటికే నాలుగు సినిమాలు ఈ ప్రాంచైజీలో వచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే 'గోల్‌మాల్ 5' సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు వచ్చి సినిమాలతో పోల్చితే ఈ సినిమా మరింత వినోదాత్మకంగా ఉంటుంది అనే నమ్మకంను యూనిట్ సభ్యులు కలిగిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అర్షన్ వార్షి, తుషార్ కపూర్, సంజయ్ మిశ్రా వంటి ప్రముఖ స్టార్స్ ఇంతకు ముందు నటించారు. ఈ కొత్త సినిమాలోనూ అంతకు మించి అన్నట్లుగా స్టార్ కాస్ట్ ఉండబోతుంది అంటూ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ జెట్ స్పీడ్‌తో చేసి వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన భూల్ భులయ్యా 3...
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొంది ఇంతకు ముందు వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. అందుకే ఈ సినిమా విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. బాలీవుడ్‌కి చెందిన కొందరు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వస్తామని దర్శకుడు రోహిత్ శెట్టి అన్నారు. గతంలో అన్నట్లుగానే గోల్‌మాల్ 5 సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే సినిమా యొక్క బిజినెస్‌ను మొదలు పెట్టారు. భూల్ భులయ్యా 3 సినిమా విషయంలో దర్శకుడు రోహిత్ శెట్టికి టి సిరీస్ మధ్య గొడవలు నెలకొన్నాయి. ముఖ్యంగా బిజినెస్ విషయంలో విభేదాలు తలెత్తాయి. దాంతో గోల్‌మాల్ సినిమా ఆడియో రైట్స్ కచ్చితంగా టి సిరీస్ కి ఇవ్వక పోవచ్చు అని ప్రముఖంగా ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి.
గోల్‌మాల్ 5 ఆడియో రైట్స్ టి సిరీస్ సొంతం...
గోల్‌మాల్ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో టి సిరీస్ సినిమా ఆడియో హక్కులు దక్కించుకునేందుకు ముందుకు వచ్చింది. భూల్ భులయ్యా సినిమా సమయంలో రోహిత్ శెట్టితో ఉన్న గొడవలకు టి సిరీస్ ఫుల్ స్టాప్ పెట్టింది. దాంతో గోల్‌మాల్ 5 సినిమా బిజినెస్ కి లైన్ క్లియర్ అయినట్లు అయింది. మరో వైపు ఈ సినిమా ఆడియో హక్కులను టి సిరీస్ తీసుకోవడం అనేది దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా కలిసి వచ్చే అంశం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గోల్ మాల్ 5 ప్రారంభం అయిన వెంటనే ఆడియో హక్కులు దాదాపుగా రూ.9 కోట్లకు అమ్ముడు పోవడంను బట్టి చూస్తే, ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ కి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఆడియో రైట్స్‌తో భారీ మొత్తం...
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు ఓటీటీ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు, ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా ఉంది. అయినా కూడా ఈ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మంచి ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. ఆడియో రైట్స్ ను రూ.9 కోట్లకు గాను టి సిరీస్ దక్కించుకున్న కారణంగా సినిమాపై నమ్మకంతో ఇతర కంపెనీలు సైతం ఈ సినిమా యొక్క రైట్స్ ను భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు గోల్‌మాల్ సినిమాలతో పోల్చితే గోల్‌మాల్ 5 సినిమా యొక్క ఆడియో రైట్స్ అత్యధిక ధర పలికినట్లు చెబుతున్నారు. కేవలం ఆడియో విషయంలోనే కాకుండా థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ కూడా భారీ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అంచనా. గోల్‌మాల్ ప్రాంచైజీకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటించేందుకు రెడీ అయింది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు. 2026 చివర్లో లేదా 2027 ఆరంభంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
