Begin typing your search above and press return to search.

గ్లాడియేటర్ II ట్రైలర్: వారియ‌ర్ తిరిగొచ్చాడు

ర‌సెల్ క్రో న‌టించిన 2000 హిస్టారికల్ డ్రామా `గ్లాడియేటర్` ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే

By:  Tupaki Desk   |   10 July 2024 4:26 AM GMT
గ్లాడియేటర్ II ట్రైలర్: వారియ‌ర్ తిరిగొచ్చాడు
X

ర‌సెల్ క్రో న‌టించిన 2000 హిస్టారికల్ డ్రామా `గ్లాడియేటర్` ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ విజ‌యంతో పాటు, ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ అవార్డుల‌ను కొల్ల‌గొట్టిన చిత్ర‌మిది. భారీ యుద్ధాలు, సాహ‌స‌విన్యాసాల‌తో, కుటిల రాజ‌నీతితో రూపొందించిన ఈ సినిమాలో బానిస‌ల విరోచిత పోరాటాల‌ను కూడా తెర‌పై ఆవిష్క‌రించిన తీరు మ‌తులు చెడ‌గొడుతుంది. డు ఆర్ డై త‌రహా పోరాట స‌న్నివేశాల‌తో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించారు.

ఇప్పుడు ఇలాంటి గొప్ప సినిమాకి దాదాపు 24 సంవ‌త్స‌రాల త‌ర్వాత సీక్వెల్ వ‌స్తోంది అంటే దానిపై ఎంతో ఉత్కంఠ నెల‌కొంటుంది. అలాంటి ఉత్కంఠ గ్లాడియేటర్ అభిమానుల్లో అలానే ఉంది. ఎట్టకేలకు ఈ సీక్వెల్ మొదటి ట్రైలర్ విడుద‌లైంది. మొద‌టి భాగాన్ని మించి ఈ సీక్వెల్ ని విజువ‌ల్ గ్రాండియారిటీతో రూపొందిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. రిడ్లీ స్కాట్ మరోసారి దర్శకత్వం వహించిన గ్లాడియేటర్ II ఒరిజిన‌ల్ కి కొన‌సాగింపు క‌థ‌తోనే రూపొందింది. కథ ఇప్పుడు మాక్సిమ‌స్ (ర‌సెల్ క్రో) వార‌సుడు లూసియస్ చూట్టూ తిరుగుతుంది. ఈ పాత్ర‌లో రైజింగ్ స్టార్ పాల్ మెస్కల్ న‌టించారు. లూసిల్లా , విలన్ కొమోడస్ (జోక్విన్ ఫీనిక్స్) ల‌తో లూసియ‌స్ అనుబంధం ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి.

ఏ యుద్ధానికి అయినా కార‌ణం న‌మ్మిన‌వారు త‌న‌వాళ్లు చేసే కుట్ర‌లేన‌ని చ‌రిత్ర నిరూపించింది. ఇప్పుడు గ్లాడియేట‌ర్ సీక్వెల్ లోను అలాంటి నీతి క‌థ‌లు ఉన్నాయి. రోమ్ అవినీతి నుండి లూసియ‌స్ (క‌థానాయ‌కుడు)ని రక్షించడానికి అతడి తల్లి ఆఫ్రికాకు పంపేస్తారు. ఆ తర్వాత లూసియస్ పెద్ద‌వాడై.. ఇప్పుడు గ్లాడియేటర్‌గా రాజధానికి తిరిగి వస్తాడు. అక్కడ అతడు మోసపూరిత రోమన్ జనరల్ మార్కస్ అకాసియస్ (పెడ్రో పాస్కల్) .. సంపన్న ఆయుధ వ్యాపారి మాక్రినస్ (డెంజెల్ వాషింగ్టన్) సహా కొత్త విరోధులతో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతాడు.

ఈ సీక్వెల్ లో మొదటి భాగం త‌ర‌హాలోనే మ‌సాలా అంశాల‌కు కొద‌వేమీ లేదు. కొత్తత‌రం తార‌లు అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా క‌థానాయ‌కుడిగా న‌టించిన పాల్ మెస్క‌ల్ ప్ర‌ద‌ర్శ‌న మ‌హ‌దాద్భుతంగా ఉంది. గ్లాడియేట‌ర్ అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సీక్వెల్లోను న్నాయి. భారీ కొల్లోసియంలో ఈసారి బ్లూవాట‌ర్ ని నింపేసి అందులో యుద్ధాలు చేయించ‌డం చాలా వినూత్నంగా క‌నిపిస్తోంది. మునుప‌టిలానే దూసుకొచ్చే వంద‌లాది బాణాలు, కోట‌ల‌పై యుద్ధాలు, భారీ షిప్పుల్లో ఫైట్స్ ఇవ‌న్నీ ఎంతో ఉత్కంఠ‌ను క‌లిగిస్తున్నాయి. మెస్కల్, పాస్కల్, వాషింగ్టన్ లాంటి ప్ర‌తిభావంతులైన తార‌లు ఈ సినిమాకి ప్ర‌ధాన అస్సెట్. ట్రైల‌ర్ ఉత్కంఠ‌ను పెంచింది. హ‌న్స్ జిమ్మ‌ర్ రీరికార్డింగ్ అద్భుతం. ట్రైల‌ర్ ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. గ్లాడియేట‌ర్ స్ఫూర్తితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో సినిమాలు తెర‌కెక్కాయి. ఇప్పుడు సీక్వెల్ ఇచ్చే స్ఫూర్తితో మ‌రోసారి అలాంటి అద్భుత‌మైన క‌థ‌ల్ని వెలికి తీసేందుకు ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తారేమో చూడాలి.

2000 లో సంచ‌ల‌నం:

గ్లాడియేటర్ అనేది 2000లో రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన హిస్టారిక‌ల్ మూవీ. డేవిడ్ ఫ్రాంజోని, జాన్ లోగాన్ , విలియం నికల్సన్ రచించిన పౌరాణిక‌ చారిత్రక నాటక చిత్రం. ఇందులో రస్సెల్ క్రోవ్, జోక్విన్ ఫీనిక్స్, కొన్నీ నీల్సన్, టోమస్ అరానా, రాల్ఫ్ ముల్లర్, ఆలివర్ రీడ్ (అతని చివరి పాత్రలో), జిమోన్ హౌన్సౌ, డెరెక్ జాకోబి, జాన్ ష్రాప్నెల్, రిచర్డ్ హారిస్, టామీ ఫ్లానాగన్ నటించారు.

చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ కుమారుడు కొమోడస్ తన తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ద్రోహం చేసిన రోమన్ జనరల్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్‌గా క్రోవ్ ను చూపిస్తారు. అత‌డు బానిస‌గా మార‌డానికి ఇది కార‌ణ‌మ‌వుతుంది. మాగ్జిమస్ గ్లాడియేటర్‌గా మారుతాడు. అతడి కుటుంబం చక్రవర్తి హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

మొదట ఫ్రాంజోని రాసిన స్క్రీన్ ప్లే, 1958 నాటి డేనియల్ పి. మానిక్స్ నవల `దస్ ఎబౌట్ టు డై` నుండి ప్రేరణ పొందింది. స్క్రిప్ట్‌ను డ్రీమ్‌వర్క్స్ పిక్చర్స్ కొనుగోలు చేసింది. స్కాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సంతకం చేశాడు. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ జనవరి 1999లో ప్రారంభమైంది. ఆ సంవత్సరం మేలో ముగిసింది. స్క్రిప్ట్‌ని అనేకసార్లు తిరగ రాయ‌డం.. నిర్మాణం పూర్తికాకముందే ఆలివర్ రీడ్ మరణంతో సినిమా రిలీజ‌వుతుందా లేదా? అన్న సందిగ్ధ‌త ఏర్ప‌డింది. కానీ ఈ సినిమా చివ‌రికి విడుద‌లై ప్రపంచవ్యాప్తంగా 466 మిలియన్ డాట‌ర్లు వసూలు చేసింది. 2000లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. విమర్శకులు నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ రూపకల్పన, మ్యూజిక్ స్కోర్‌లను ప్రశంసించారు. ఈ చిత్రం క్రోవ్‌కి ఉత్తమ చిత్రం .. ఉత్తమ నటుడు సహా ఐదు అకాడమీ అవార్డులను అందించింది. గ్లాడియేటర్ II పేరుతో సీక్వెల్ 22 నవంబర్ 2024న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల కానుంది.