'ప్రేమలు' కాంబో రిపీట్.. ప్రొడ్యూసర్ గా షెకావత్.. క్రేజీ మూవీ ఫిక్స్!
ఇప్పుడు మరోసారి గిరీష్ ఏడీ, మమితా బైజు చేతులు కలిపారు. కలిసి మళ్లీ వర్క్ చేయనున్నారు. ఆ సినిమాలో బెంగళూరు డేస్ ఫేమ్ నటుడు నివిన్ పౌలీ లీడ్ రోల్ పోషించనున్నారు.
By: Tupaki Desk | 5 July 2025 3:17 PM ISTమాలీవుడ్ మూవీ ప్రేమలు ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఓటీటీలోనూ దూసుకుపోయింది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఆ రొమాంటిక్ కామెడీ డ్రామాలో యంగ్ బ్యూటీ మమితా బైజు ఫిమేల్ రీల్ రోల్ లో యాక్ట్ చేసి మెప్పించింది.
ఇప్పుడు మరోసారి గిరీష్ ఏడీ, మమితా బైజు చేతులు కలిపారు. కలిసి మళ్లీ వర్క్ చేయనున్నారు. ఆ సినిమాలో బెంగళూరు డేస్ ఫేమ్ నటుడు నివిన్ పౌలీ లీడ్ రోల్ పోషించనున్నారు. మాలీవుడ్ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ నిర్మించనున్నారు. బెత్లెహెం కుడుంబ యూనిట్ టైటిల్ తో రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఆ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫహాద్ ఫాజిల్ పార్టనర్ గా ఉన్న భావన స్టూడియోస్ ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది. తమ బ్యానర్ పై ఆరో సినిమాగా అనౌన్స్ చేసింది. నివిన్ పౌలీ, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కథ బెత్లెహెం కుడుంబ యూనిట్ ప్రొడక్షన్ నంబర్ 6 కోసం భావన స్టూడియోస్ గిరీష్ తో జతకడుతున్నట్లు పంచుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉందని తెలిపింది. 2025 సెప్టెంబర్ లో సినిమా నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పింది.
సినిమాకు సంబంధించిన ప్రధాన తారాగణం, నిర్మాతలు, సిబ్బంది పేర్లను ప్రస్తావిస్తూ మేకర్స్ ప్రకటించారు. పోస్ట్ ద్వారా బెత్లెహెం కుడుంబు యూనిట్ ను మల్టీ టాలెంటెడ్ ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మిస్తారని తెలిపారు. గిరీష్ ఏడీ, కిరణ్ జోసీ రచయితలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
సినిమాకు విష్ణు విజయ్ సంగీతాన్ని సమకూర్చుతుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలు అజ్మల్ సాబు నిర్వర్తిస్తారని చెప్పారు. ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటర్ గా వర్క్ చేస్తారని తెలిపారు. అయితే ఇప్పటికే నివిన్, మమితకు మంచి క్రేజ్ ఉంది. దీంతో వారిద్దరినీ ప్రేమ కథలో చూడటానికి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పాలి. ప్రేమలు, సూపర్ శరణ్య తర్వాత దర్శకుడు గిరీష్ ఏడీతో నటి మమిత కలిసి వర్క్ చేస్తున్న మూడో చిత్రం బెత్లెహెం కుడుంబ యూనిట్ కావడం విశేషం.