Begin typing your search above and press return to search.

ట్విషా శర్మ మృతి కేసు: కోడలి మానసిక స్థితిపై అత్త ఆరోపణలు.. పుట్టిల్లు కౌంటర్!

భోపాల్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు పుట్టింటివారికి, అత్తగారి కుటుంబానికి మధ్య ఒక పెద్ద ఆరోపణల యుద్ధంగా మారింది.

By:  Sivaji Kontham   |   19 May 2026 3:18 PM IST
ట్విషా శర్మ మృతి కేసు: కోడలి మానసిక స్థితిపై అత్త ఆరోపణలు.. పుట్టిల్లు కౌంటర్!
X

భోపాల్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు పుట్టింటివారికి, అత్తగారి కుటుంబానికి మధ్య ఒక పెద్ద ఆరోపణల యుద్ధంగా మారింది. ఈ కేసులో నిందితురాలిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొని.. ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న ట్విషా అత్తగారు.. రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ ఇటీవల మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఇంట్లో కోడలికి అన్ని రకాల స్వేచ్ఛను ఇచ్చామని స్పష్టం చేసిన ఆమె.. అందుకు ఆధారాలుగా కోడలి వ్యక్తిగత అవసరాల కోసం తాము రెగ్యులర్‌గా రూ. 5000 నుండి రూ. 50,000 వరకు త‌న‌కు అందజేసేవాళ్ల‌మ‌ని కొన్ని మనీ ట్రాన్స్ ఫ‌ర్ స్లిప్‌లను మీడియాకు చూపించారు. ఆర్థిక వేధింపుల ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యంగా అత్తగారి తరపున ఈ ఆధారాలను బహిర్గతం చేయడం గమనార్హం.

అయితే ట్విషా శర్మ మానసిక స్థితి అసలు బాగుండేది కాదంటూ అత్త గిరిబాల సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేసాయి. పెళ్లయిన ఐదు నెలలకే ట్విషా చాలా స్వేచ్ఛా భావాలు కలిగిన అమ్మాయిగా మారిందని.. సాయంత్రం వేళల్లో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లి వచ్చేదని అత్త‌గారు ఆరోపించారు. అయితే ట్విషా త‌న‌కు ఫ్రెగ్నెన్సీ నిర్ధార‌ణ అయ్యాక చాలా కంగారుగా క‌నిపించింద‌ని బిహేవియ‌ర్ మార్పులు గ‌మ‌నించామ‌ని.. త‌న‌ గర్భాన్ని రిమూవ్ చేసుకోవాలంటూ తీవ్రంగా పట్టుబట్టిందని అత్త‌గారు వ్యాఖ్యానించారు. ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన రోజు సాయంత్రం ట్విషా తీవ్ర భావోద్వేగానికి లోనై.. తనను తాను హింసించుకుంటూ ``నేను ఇలా బతకలేను`` అని ఏడ్చిందని.. ఈ మానసిక ఒత్తిడే త‌న‌ మృతికి దారితీసి ఉండవచ్చనే కోణంలో అత్తగారు వాదనలు వినిపించారు.

ఈ వ్యాఖ్యలపై ట్విషా తండ్రి నవనిధి శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురుదాడికి దిగారు. మరణించిన తన కూతురి క్యారెక్టర్‌ను పబ్లిక్‌గా తక్కువ చేసి చూపిస్తూ... లేనిపోని బేస్ లెస్ ఆరోపణలతో మ‌ర‌ణించిన వ్య‌క్తి ప్రతిష్టను మసకబార్చడానికి అత్తగారి కుటుంబం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ముందస్తు బెయిల్‌పై ఉన్న ఒక రిటైర్డ్ జడ్జి ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం బెయిల్ నిబంధనలను.. చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని తండ్రి ధ్వజమెత్తారు. నిందితులు న్యాయవ్యవస్థలో తమకున్న పాత పరిచయాలు.. ఉన్నత అధికారాలను ఉపయోగించి కేసును పక్కదారి పట్టించడానికి.. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ట్విషా మరణించి ఇన్ని రోజులవుతున్నా మృతదేహానికి ఇంకా రెండవసారి పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడం వెనుక పెద్దల హస్తం ఉందని...శరీరం కుళ్ళిపోయేలా చేసి ఆధారాలు లభించకుండా చేయాలనేదే వారి ప్లాన్ అని బాధితురాలి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మధ్యప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. ఈ కేసు దర్యాప్తును రాష్ట్రం వెలుపలికి మార్చాలని.. సుప్రీంకోర్టు లేదా భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరిపించాలని ట్విషా తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఇరువైపులా విరుద్ధమైన స్టేట్‌మెంట్లు.. ఆరోపణలతో భోపాల్‌లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అయితే ఈ కేసును వ‌ర‌క‌ట్న వేధింపుల కోణంతో పాటు ప‌లు కోణాల్లో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అత్తింటి ఆర‌ళ్లు ముఖ్య కార‌ణ‌మా? లేక అత్త‌గారు ఆరోపించిన‌ట్టు కోడ‌లి స్వేచ్ఛా ఆలోచ‌న‌ల ధోర‌ణి ఈ ప‌ర్య‌వ‌సానానికి దారి తీసిందా? అన్న‌ది కోర్టులో నిగ్గు తేలాల్సి ఉంటుంది.