ఘట్టమనేని థర్డ్ జెనరేషన్ ఎంట్రీకి రంగం సిద్ధం
అతను మరెవరో కాదు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న అయిన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ.
By: Tupaki Desk | 31 May 2025 5:14 PM ISTటాలీవుడ్ గర్వించదగ్గ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. మే 31న ఆయన జయంతి సందర్భంగా ఘట్టమనేని ఫ్యాన్స్ కు పలు రకాలుగా స్పెషల్ ట్రీట్స్ అందుతున్నాయి. కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాను రీరిలీజ్ చేయగా, అదే సందర్భంగా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ఈ రోజున తన కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు.
అతను మరెవరో కాదు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ అన్న అయిన రమేష్ బాబు కొడుకు జయకృష్ణ. అంటే కృష్ణ గారికి స్వయానా మనవడు. త్వరలోనే ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే జయకృష్ణ యాక్టింగ్ తో పాటూ పలు విషయాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి విజనరీ డైరెక్టర్ జయకృష్ణ డెబ్యూ బాధ్యతల్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే జయకృష్ణ ఫోటో షూట్ కూడా పూర్తి కాగా కృష్ణ జయంతి సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. ఈ ఫోటోల్లో జయకృష్ణ ఎంతో ఛార్మింగ్ గా, హ్యాండ్‌సమ్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించేలా కనిపించాడు. త్వరలోనే జయకృష్ణ మొదటి సినిమా మొదలు కానుండగా, ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు? ఎవరు నిర్మించనున్నారనే విషయాలు కూడా వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం ఘట్టమనేని జయకృష్ణ ఫోటోలను కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ లైకులు కొడుతూ వైరల్ చేస్తూ ఘట్టమనేని వారసుడి ఎంట్రీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కృష్ణ తర్వాత ఆయన కొడుకులుగా రమేష్ బాబు, మహేష్ బాబులు సెకండ్ జెనరేషన్ హీరోలుగా రాగా, ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మూడో తరం కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.
