Begin typing your search above and press return to search.

భగవద్గీత వినకుండానే దివికేగిన ఘంటసాల

ఘంటసాల సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటే 1944 నుంచి 1974 దాకా సాగింది. అంటే మూడు దశాబ్దాల కాలం అన్న మాట.

By:  Satya P   |   11 Feb 2026 1:00 PM IST
భగవద్గీత వినకుండానే దివికేగిన ఘంటసాల
X

ఘంటసాలను గాన గంధర్వుడు అని చెప్పడం వేయి శాతం కరెక్ట్. ఆయన తన గాంధర్వ గానంతో మూడు దశాబ్దాల పాటు తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు ఎన్నో భక్తి గీతాలు మధుర గీతాలు ఆ కంఠం నుంచి జాలు వారాయి. ఆయన గొంతులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఏ భావాన్ని అయినా ఇట్టే పలికిస్తుంది. నవరసాలలూ అక్కడ తొణికిసలాడుతాయి. సరిగమలు ఆ గొంతుతో కలసి పరవశించి పోతాయి . ఘంటసాల లాంటి గాయకుడు మళ్ళీ పుట్టబోరు అంటే అతిశయోక్తి కాదు.

యజ్ఞం గా సాగింది :

ఘంటసాల సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటే 1944 నుంచి 1974 దాకా సాగింది. అంటే మూడు దశాబ్దాల కాలం అన్న మాట. దాదాపుగా పదివేల పాటలు ఆయన పాడారు. యాభై ఏళ్ళకే ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. దాని కంటే ముందు అయిదేళ్ళ పాటు ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఘంటసాల తన గాయక జీవితానికి ఒక సార్ధకత ఉండాలని భావించి భగవద్గీతను ఆలపించాలని అనుకున్నారు. చివరి రోజులలో ఆయన దాని కోసం పడిన తపన అంతా ఇంతా కాదు, ఒక యజ్ఞంగా శ్రమించారు, ఒక వైపు అనారోగ్యం సహకరించకపోయినా తానే గానం సంగీతం చేస్తూ భగవద్గీత శ్లోకాలను తాత్పర్య సహితంగా ఆలపించారు. అలా తెలుగు జాతికి ఎంతో విలువైన కానుకను ఆయన అందించారు.

అమోఘమైన తీరులో :

ఘంటసాల భగవద్గీతను అమోఘమైన తీరులో ఆలపించారు. మొత్తం 700 కి పైగా భగవద్గీత శ్లోకాలు ఉంటే అందులో భగవద్గీత నుండి ఎంపిక చేసిన 106 శ్లోకాలకు తానే స్వయంగా సంగీతానికి అమర్చి ఘంటసాల అద్భుతమైన వ్యాఖ్యానంతో రికార్డ్ చేశారు. ఇదంతా ఘంటసాల మరణించడానికి కొంతకాలం ముందు భగవద్గీత మీద చేసిన అకుంఠితమైన పరిశ్రమగా ఉంది.

కాన రాని లోకాలకు :

ఇంత ప్రయత్నం చేసిన ఘంటసాల తాను భగవద్గీత శ్లోకాలను రికార్డు అయ్యాక పూర్తిగా వినకుండానే 1974 ఫిబ్రవరి 11న అంటే సరిగ్గా ఈ రోజున మరణించారు. ఈవాల్టికి ఆయన స్వర్గస్థులు అయి 52 ఏళ్ళు అయింది అన్న మాట. ఆ విధంగా ఘంటసాల తెలుగు జాతికి అందించిన అపూర్వమైన వరం ఆయన పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్ళిపోవడం బాధాకరమైన విషయంగానే అభిమానులకు ఎప్పుడూ ఉంటుంది.

రెండు నెలలకు విడుదల :

ఇక ఘంటసాల మరణించిన రెండు నెలలకు అంటే 1974 ఏప్రిల్ 21న భగవద్గీత రికార్డులు అశేష జనానికి అందుబాటులోకి తెస్తూ సదరు హెచ్ ఎం వీ కంపెనీ వారు విడుదల చేశారు. విజయవాడలో నాడు జరిగిన ఈ కార్యక్రమానికి నాటి వెండి తెర వేలుపు టాప్ స్టార్ ఎన్టీఆర్ ఈ రికార్డులను విడుదల చేయడం విశేషం. ఆ కార్యక్రమంలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత తెలుగు వారి సాహితీ గర్వం అయిన కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ఈ భగవద్గీత రికార్డుల విడుదలకు హాజరై తన ప్రియ శిష్యుడు ఎన్టీఆర్ నుంచి తొలి రికార్డుని అందుకోవడం మరో ముచ్చట. అయితే ఘంటసాల మరణానంతరం విడుదల అయిన భగవద్గీత రికార్డులు అత్యంత ప్రజాదరణ పొందాయి. తెలుగు వారి గుండెలలో ఈ రోజుకీ అవి సుస్థిరమైన స్థానం సంపాదించాయని చెప్పక తప్పదు, అందుకే ఈ రోజు ఘంటసాల వర్ధంతి వేళ ఆ మహనీయుడికి మరోసారి ఘన నివాళిని అంతా అర్పిస్తున్నారు.