10ఏళ్ల గ్యాప్ గురించి జెనీలియా ఆందోళన!
పెళ్లి చేసుకుని పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై జెనీలియా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.
By: Tupaki Desk | 12 Jun 2025 10:12 AM ISTకెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ని పెళ్లాడింది జెనీలియా. బలమైన రాజకీయ నేపథ్యం పైగా మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయిన రితేష్ ని పెళ్లాడటంతో అప్పట్లో జెనీలియా పేరు ప్రధానంగా మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చింది. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యం ప్రధానంగా చర్చనీయాంశమైంది. అయితే రితేష్‌ను వివాహం చేసుకున్న తర్వాత 2012లో జెనీలియా నటన నుండి విరామం తీసుకుంది. చివరికి మరాఠీ చిత్రం `వేద్`తో తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. 2022లో విడుదలైన ఈ చిత్రానికి రితేష్ స్వయంగా దర్శకత్వం వహించగా మరాఠాలో విజయవంతమైంది. అయితే జెనీలియా నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. సల్మాన్ - జై హో, జాన్ అబ్రహాం- ఫోర్స్ 2 వంటి చిత్రాలలో అతిధి పాత్రలలోను జెనీలియా కనిపించింది.
పెళ్లి చేసుకుని పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై జెనీలియా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. నేను పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు అంతగా ఆందోళన లేదు. అదే బయటి వ్యక్తి అయితే ఈ గ్యాప్ వచ్చినందుకు చాలా ఆందోళన చెందుతారు. నేను- నా భర్త వారి కంటే బాగా ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలమని అనుకుంటున్నాను. అయినా నేను 10 ఏళ్లు విరామం తీసుకోవాలని అనుకున్నాను. అలా చేయడమే నాకు కరెక్ట్ అనిపించింది. అప్పుడు నాకు ఉన్న ఆప్షన్ అదొక్కటే. నేను అనుకున్నదే చేసాను. షూటింగులు చేయడం అంటే రేయింబవళ్లు కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. రాత్రి పూట షూట్ లతో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే ఈ గ్యాప్ తీసుకున్నాను. సరైన సమయంలో రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఆనందకరమైన స్థానంలో ఉన్నాను అని జెనీలియా వివరణ ఇచ్చింది. రితేష్-జెనీలియా ఇద్దరు అందమైన పిల్లలకు పేరెంట్. పిల్లల కోసం జెనీలియా తన కెరీర్ ని కొంత త్యాగం చేసింది.
పరిస్థితుల వల్ల కొంత గ్యాప్ లు వచ్చినా జెనీలియా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి `సీతారే జమీన్ పర్`తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్పానిష్ చిత్రం `కాంపియోన్స్`కి అధికారిక హిందీ రీమేక్ ఇది. ఒక టోర్నమెంట్ కోసం మానసిక వికలాంగురైన కొందరు పిల్లల టీమ్‌కు శిక్షణ ఇవ్వవలసి వచ్చే పరిస్థితిలో బాస్కెట్‌బాల్ కోచ్ (అమీర్) కథేమిటన్నది తెరపై చూడాలి. అతడి భార్యగా జెనీలియా నటించింది. ఈ చిత్రం అమీర్ ఖాన్ నటించిన 2007 డ్రామా చిత్రం `తారే జమీన్ పర్`కి సీక్వెల్. జెనీలియా బొమ్మరిల్లు హాసినిగా ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉన్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు, బోయ్స్, హ్యాపీ సహా పలు విజయవంతమైన చిత్రాల్లో జెనీలియా నటించింది.
