జెనీలియా కంబ్యాక్ వెనుక కారకుడు!
కుటుంబం, కాపురం అంటూ ఆ బిజీలోనే పడిపోయింది. చివరిగా ` నా ఇష్టం`లో నటించింది.
By: Tupaki Desk | 17 July 2025 1:00 AM ISTజెనీలియా టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి. 'సత్యం'తో పరిచయమైన అమ్మడు అటుపై 'సాంబ', 'సై', 'నా అల్లుడు', 'హ్యాపీ', 'బొమ్మరిల్లు' లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. నటిగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అప్పటి యువతలో ఓ కలల రాణిగా వెలిగిపోయింది. ఈ సినిమాలన్నింటి కంటే ముందే 'బోయ్స్' చిత్రంతో వెలుగులోకి వచ్చింది. అటుపై బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది. రితీష్ దేశ్ ముఖ్ తో వివాహం తర్వాత సినిమాలంటే ఆసక్తి కూడా తగ్గించింది.
కుటుంబం, కాపురం అంటూ ఆ బిజీలోనే పడిపోయింది. చివరిగా 'నా ఇష్టం'లో నటించింది. ఆ తర్వాత మళ్లీ జాడలేదు. తాజాగా 13 ఏళ్ల తర్వాత అమ్మడు మళ్లీ 'జూనియర్' సినిమాతో కంబ్యాక్ అవుతోంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరిటీ ఈసినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో జెనిలియా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో తాను భాగమవుతానని జెనీలియా ఎప్పుడూ అనుకోలేదంది. ఈ సినిమా చేయడానికి కారణం కూడా తన భర్త రితీష్ దేశ్ ముఖ్ గా చెప్పుకొచ్చింది.
మూడేళ్ల క్రితం ఈ కథ రితీష్ ద్వారా తన వద్దకు వచ్చిందిట. అప్పటికే జెనీలియా సినిమాలు చేయలేదు. పిల్లలు ఆలనా పాలనా చూసుకుంటూ కుటుంబ జీవితంలో పడిపోయింది. మళ్లీ సినిమలు చేయాలా? వద్దా? అన్న ఆలోచన కూడా అప్పుడే సీరియస్ గా చేస్తోందిట. ఆ సమయంలో ఈసినిమా కచ్చితంగా చేయాలని...మంచి కంబ్యాక్ అవుతుందని రితీష్ పట్టుబట్టాడుట. జెనీలియా కోరుకున్నది ఈ కథలో ఉందని ఓరకమైన ఒత్తిడే తెచ్చాడుట. దీంతో కథ వినడం నచ్చడంతో మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పినట్లు తెలిపింది.
సినిమాలో బాస్ పాత్ర గంభీరంగా ఉంటుందని తెలిపింది. అలాగే కెరీర్ ఆరంభంలో చాలా మంది కొత్త హీరోలతో పనిచేసినట్లు గుర్తు చేసుకుంది. ఇప్పుడు వాళ్లంతా పెద్ద స్టార్లగా ఎదిగారని ఆ రకంగా తనకెంతో సంతోషంగా ఉందంది. నిజమే జెనీలియాతో నటించిన రామ్, సిద్దార్ద్, బన్నీ, ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద స్టార్లు అయిన సంగతి తెలిసిందే.
