Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : గీతాంజలి మళ్ళీ వచ్చింది

పదేళ్ల కిందట మంచి విజయం సాధించిన హార్రర్ కామెడీ ఫిలిం.. గీతాంజలి. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది.

By:  Tupaki Desk   |   11 April 2024 9:09 AM GMT
మూవీ రివ్యూ : గీతాంజలి మళ్ళీ వచ్చింది
X

'గీతాంజలి మళ్ళీ వచ్చింది' మూవీ రివ్యూ

నటీనటలు: అంజలి-శ్రీనివాసరెడ్డి-రవిశంకర్-ప్రియ-షకలక శంకర్-సత్యం రాజేష్-ఆలీ-సునీల్-శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

ఛాయాగ్రహణం: సుజాత సిద్దార్థ్

రచన: భాను భోగవరపు-నందు-కోన వెంకట్

నిర్మాతలు: ఎంవీవీ సత్యనారాయణ-జి.వి

దర్శకత్వం: శివ తుర్లపాటి

పదేళ్ల కిందట మంచి విజయం సాధించిన హార్రర్ కామెడీ ఫిలిం.. గీతాంజలి. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. అదే.. గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంజలినే ఇందులోనూ ప్రధాన పాత్ర పోషించింది. శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను భయపెట్టి.. నవ్వించిందా..? చూద్దాం పదండి.

కథ:

గీతాంజలి అనే హిట్టు సినిమా తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు తీసి ఇబ్బందుల్లో పడతాడు దర్శకుడు శ్రీనివాస్ అలియాస్ శీను (శ్రీనివాసరెడ్డి). అతను తీసే సినిమాతో హీరో అయ్యి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలని చూస్తుంటాడు అయాన్ (సత్య). కానీ నిర్మాత కోసం శీను చేసిన ప్రయత్నాలు ఫలించవు. అలాంటి టైంలోనే ఊటీకి చెందిన ఒక ఎస్టేట్ యజమాని తాను రాసిన కథతో సినిమా తీయమని శీనుకు ఆఫర్ ఇస్తాడు. దీంతో తన టీంతో కలిసి ఊటీ చేరుకుంటాడు శీను. ఊటీలోనే కాఫీ షాప్ నడుపుతున్న గీతాంజలి (అంజలి)ని తన సినిమా కోసం కథానాయికగా ఎంచుకుని.. నిర్మాత కొన్న ఒక బూత్ బంగ్లాలో సినిమా షూటింగ్ చేయడానికి రెడీ అవుతాడు శీను. కానీ భూతాల నిలయంగా పేరున్న ఆ బంగ్లాలో వీళ్లందరికీ చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. వీళ్లందరూ అక్కడికి చేరడం వెనుక పెద్ద కుట్ర ఉందని కూడా తెలుస్తుంది. ఆ కుట్ర ఏంటి.. ఆ బంగ్లాలో వీళ్ల షూటింగ్ సవ్యంగా సాగిందా.. చివరికి వీళ్లంతా అక్కడి నుంచి బయటపడ్డారా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

హార్రర్ కామెడీ.. టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను భలేగా ఎంటర్టైన్ చేసి.. చాలా వేగంగా స్టేల్ అయిపోయిన జానర్. ఈ జానర్ సినిమాలు బాగా ఆడుతున్నాయని టాలీవుడ్ ఫిలిం మేకర్లు దీన్ని మరీ అరగదీసేశారు. ఈ జానర్లో సినిమాలంటే ఒక మూసలో సాగిపోతుండడంతో జనాలకు మొహం మొత్తేసి తిరస్కరించడం మొదలుపెట్టారు. దీంతో నెమ్మదిగా ఈ జానర్ సినిమాలు ఆగిపోయాయి. హార్రర్ కామెడీలు బాగా నడుస్తున్న టైంలో దాన్ని బాగా వాడుకున్న సినిమాల్లో 'గీతాంజలి' ఒకటి. ఐతే ఇప్పుడు రకరకాల సినిమాలకు సీక్వెల్స్ తీసే ట్రెండు నడుస్తుండడంతో 'గీతాంజలి' టీంకు కూడా ఇంకో సినిమా తీయాలనే ఆశ పుట్టి.. సెకండ్ పార్ట్ చేసింది. కానీ హార్రర్ కామెడీలు బాగా నడుస్తున్న టైంలో వచ్చి ఉన్నా కూడా.. ప్రేక్షకులను భయపెట్టడం కానీ.. నవ్వించడం కానీ చేసేది కాదేమో ఈ సినిమా. అంత సాధారణమైనా కథాకథనాలతో.. ఔట్ డేటెడ్ సీన్లతో తీవ్ర నిరాశకు గురి చేస్తుంది 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. పేరుకిది హార్రర్ కామెడీ కానీ.. హార్రర్ ఫ్యాక్టర్ కానీ.. కామెడీ ఫ్యాక్టర్ కానీ అస్సలు వర్కవుట్ కాలేదు. 'గీతాంజలి' సినిమాకు ప్రాపర్ సీక్వెల్ లాగా దీన్ని తీర్చిదిద్దినా.. ఫస్ట్ పార్టులో ఉన్న ఎంగేజింగ్ కథనం లేకపోవడంతో ఇది పూర్తిగా మిస్ ఫైర్ అయింది.

హార్రర్ కామెడీ సినిమాలు అనగానే ఒక బూత్ బంగ్లా.. అందులో కొన్ని దయ్యాలు.. చుట్టు పక్కల వాళ్లంతా భయపడే ఆ ప్రదేశంలోకి ఒక బృందం ఏదో కార్యం మీద దిగడం.. వాళ్లు అక్కడి దయ్యాన్ని చూసి భయపడ్డం.. ఈ క్రమంలో దయ్యం బ్యాక్ స్టోరీ తెలియడం.. చివరికి ఆ దయ్యం ప్రతీకారం తీరడం.. ఇదొక రెగ్యులర్ ఫార్మాట్ అన్నమాట. నేపథ్యాలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి కానీ.. హార్రర్ కామెడీ సినిమాలన్నీ ఇదే లైన్లోనే సాగిపోవడం వల్ల త్వరగా ఈ జానర్ జనాలకు మొహం మొత్తేసింది. 'గీతాంజలి'కి కొనసాగింపుగా వచ్చిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' కూడా దాదాపుగా ఇదే లైన్లో రొటీన్ గా సాగిపోతుంది. కాకపోతే 'గీతాంజలి'తో దీనికి లింక్ పెట్టిన విధానం.. ఇంటర్వెల్లో వచ్చే మలుపు.. కొంత ఆసక్తి రేకెత్తిస్తాయి. కథ పరంగా కొంచెం కసరత్తు కనిపిస్తుంది. కానీ సమస్యంతా కథనంతోనే. హార్రర్ కామెడీ సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే సగటు వినోదం ఇందులో పూర్తిగా తేలిపోవడంతో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ తప్పదు. దయ్యాలను చూస్తే భయం కలగడం పోయి కామెడీగా అనిపిస్తే.. కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి.

దయ్యాలను చూసి భయపెట్టడం ద్వారా కామెడీ పండించడం రొటీన్ అనుకున్నారో ఏమో.. దయ్యాలను ఇందులో కామెడీ క్యారెక్టర్లలాగా చూపించారు. దయ్యాలు మనుషులతో చాలా మామూలుగా మాట్లాడేస్తుంటాయి. బంగ్లాలో అతిథుల్లా తిరిగేస్తుంటాయి. వాటిని చూసి మిగతా క్యారెక్టర్లు భయపడ్డం లాంటిదేమీ ఉండదు. ఒక దయ్యంతో కలిసి ఓ క్యారెక్టర్ మందు కొడితే.. ఇంకో క్యారెక్టర్ కబుర్లు చెబుతూ టీవీ చూస్తుంది. ఇంకో పాత్ర.. యాక్టింగ్ గురించి డిస్కస్ చేస్తుంది. దయ్యాలను ఇంత క్యాజువల్ గా చూపించాక ప్రేక్షకులకు భయం ఎలా కలుగుతుంది. ఆ తర్వాత వినోదం ఎలా పడుతుంది? అసలు థ్రిల్ ఫ్యాక్టరే లేకపోవడం వల్ల చాలా సన్నివేశాలు సాదాసీదాగా తయారయ్యాయి. ప్రథమార్ధంలో కూడా పెద్దగా వినోదం ఏమీ లేకపోయినా.. కనీసం కథలోని కొన్ని మలుపుల వల్ల.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి వల్ల కొంత ఎంగేజ్ అవుతాం. కానీ కథ బూత్ బంగ్లాకు చేరాక ద్వితీయార్ధంలో ప్రతి నిమిషం సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమా షూటింగ్ కు సంబంధించిన సన్నివేశాల్లోనే కాక డైలాగుల్లోనూ పంచ్ మిస్సవడంతో సమయం భారంగా గడుస్తుంది. సత్య పాత్ర అంతో ఇంతో వినోదం పంచుతుంది కానీ.. మిగతా పాత్రలన్నీ పేలవంగా తయారయ్యాయి. సునీల్ సహా ఏ పాత్రా వినోదం పంచదు. అంజలి పాత్రనైతే మరీ తేల్చిపడేశారు. విలన్ పాత్ర ఒక దశలో ఆసక్తికరంగా అనిపించినా.. రాను రానూ అదీ తేలిపోయింది. చివర్లో దయ్యాల గొడవ అయితే మరీ కామెడీగా తయారైంది. మొత్తంగా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' చెట్టు పేరు చెప్పి కాయలమ్మే చందంగా తయారైంది. 'గీతాంజలి'లో పావు వంతు థ్రిల్.. కామెడీని పంచడంలో కూడా ఈ సీక్వెల్ సక్సెస్ కాలేకపోయింది. నటీనటులు: చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన అంజలికి 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ఏమాత్రం గుర్తుంచుకోదగ్గ సినిమా కాదు. ఆమెలోని మంచి నటిని ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది. మిగతా పాత్రల్లో ఆమెదీ ఒకటిలా కనిపిస్తుందే తప్ప తన క్యారెక్టర్లో ఏ ప్రత్యేకత లేదు. చాలా చోట్ల అంజలి ఉత్సవ విగ్రహంలా కనిపించింది. అలాంటి పెర్ఫామర్ కు ఇలాంటి పాత్ర ఇవ్వడం అన్యాయంగా అనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ పాత్రకు న్యాయం చేశాడు కానీ.. అతను కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సినిమా మొత్తంలో ప్రేక్షకులను కొంత నవ్వించేదంటే సత్య ఒక్కడే. డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో డైలాగులు చెబుతూ అతను ఎంటర్టైన్ చేశాడు. సునీల్ కామెడీ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. దయ్యం పాత్రల్లో రవిశంకర్.. ప్రియ కూడా సాధారణంగా అనిపిస్తారు. సత్యం రాజేష్.. షకలక శంకర్.. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' చాలా సాధారణంగా అనిపిస్తుంది. ప్రవీణ్ లక్కరాజు పాటల్లో గుర్తుంచుకోదగ్గవి ఏవీ లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ సగటు హార్రర్ కామెడీ సినిమాలకు తగ్గట్లే సాగింది. సుజాత సిద్దార్థ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఏమంత గొప్పగా లేవు. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తాయి. రచయితలు కోన వెంకట్.. భాను.. నందు.. 'గీతాంజలి'కి దీనికి లింక్ పెడుతూ రాసిన కథ పర్వాలేదనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. డైలాగుల గురించి చెప్పుకోవడానికేమీ లేదు. శివ తుర్లపాటి టేకింగ్ కూడా మామూలుగా అనిపిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాల్లో ఔట్ డేటెడ్ ఫీల్ గుప్పుమని కొడుతుంటుంది. కామెడీ పూర్తిగా మిస్ ఫైర్ అయింది. ద్వితీయార్ధంలో అయితే 'గీతాంజలి'ని భరించడం చాలా కష్టమవుతుంది.

చివరగా: గీతాంజలి.. ఈసారి భయం లేదు.. నవ్వుల్లేవు

రేటింగ్- 2/5