విజయ్ దేవరకొండ కాకుండా నేను చేసి ఉంటే...!
సినిమా ఇండస్ట్రీలో కథలు ఒకరి వద్ద నుంచి మరొకరి వద్దకు వెళ్తూ ఉంటాయి. ఒకరికి నచ్చని కథ మరొకరికి నచ్చుతుంది.
By: Tupaki Desk | 4 Jun 2025 12:30 PMసినిమా ఇండస్ట్రీలో కథలు ఒకరి వద్ద నుంచి మరొకరి వద్దకు వెళ్తూ ఉంటాయి. ఒకరికి నచ్చని కథ మరొకరికి నచ్చుతుంది. ఒకరి అభిరుచి మరొకరి అభిరుచికి విభిన్నంగా ఉంటుంది. కొందరు తమ ఇమేజ్‌కి సెట్ కావు అని కొందరు కథలను వదులుకుంటే, మరికొందరు తమ స్థాయికి తగ్గ కథ కాదని వదులుకున్న సందర్భాలు ఉంటాయి. ఇండస్ట్రీలో ఇలా కథలు చేతులు మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా చేతులు మారిన కథలు కొన్ని హిట్ అయితే, కొన్ని ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తిరస్కరించిన చాలా కథలు రవితేజ చేసి సూపర్ హిట్ దక్కించుకున్నాడు అంటారు. తాజాగా గీత గోవిందం కథ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చిన గీత గోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే కాకుండా రష్మిక కెరీర్‌లోనూ ఆ సినిమా చాలా స్పెషల్‌గా నిలిచింది. ఆ సినిమా ఫలితం కారణంగానే దర్శకుడు పరశురామ్‌కి మహేష్ బాబుతో సినిమాను చేసే అవకాశం దక్కింది. యూత్‌లో ఇప్పటికీ విపరీతమైన బజ్ ను కలిగి ఉన్న గీత గోవిందం కథ మొదట హీరో నారా రోహిత్ వద్దకు వచ్చిందట. ఆ విషయాన్ని స్వయంగా నారా రోహిత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
నారా రోహిత్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సోలో' సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో మరో సినిమాకు ఏర్పాట్లు జరిగాయి. నారా రోహిత్ కోసం దర్శకుడు పరశురామ్ గీత గోవిందం కథను సిద్ధం చేశాడు. ఆ కథను నారా రోహిత్‌కు సైతం వినిపించాడట. కథ నచ్చడంతో నారా రోహిత్ సొంత బ్యానర్‌లో నిర్మించేందుకు ఆసక్తి చూపించాడు. కానీ ఆ కథ గీతా ఆర్ట్స్ వారి వద్దకు వెళ్లిందని తెలిసింది. అంతే కాకుండా ఆ కథతో విజయ్ దేవరకొండ హీరోగా సినిమాను గీతా ఆర్ట్స్ వారు చేయాలని చూస్తున్నారని తెలిసింది. అప్పుడే అర్జున్ రెడ్డితో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ అయితే ఆ సినిమాకు న్యాయం చేస్తాడని భావించాను అని రోహిత్ అన్నాడు.
గీత గోవిందం సినిమాను విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేస్తే దర్శకుడు పరశురామ్‌కి మంచి బ్రేక్ లభిస్తుందని భావించాను. అందుకే నేను సినిమా నుంచి తప్పుకున్నాను. నేను ఆ సినిమాను చేసి ఉంటే రూ.15 కోట్లకు మించి వసూళ్లు చేసి ఉండక పోయేది అంటూ రోహిత్ ఓపెన్‌గా చెప్పాడు. విజయ్‌తో తీయడం వల్లే సినిమా అంత పెద్ద విజయం సాధించిందని, నేను చేయకుండా ఆ సినిమాను విజయ్ చేయడం ద్వారా మంచే జరిగిందని నారా రోహిత్ చాలా ఓపెన్‌గా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నారా రోహిత్ ఇలా చెప్పాడు తప్ప మరే హీరో ఇలా నేను కాకుండా ఆ సినిమా చేయడం వల్లే సినిమా హిట్ అయిందని చెప్పే సాహసం చేయరు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నారా రోహిత్‌ను అభినందించకుండా ఉండలేం అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నారా రోహిత్ ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌తో కలిసి భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు పర్వాలేదు అనే టాక్ దక్కించుకున్నప్పటికీ ఖలేజా జోరు ముందు నిలువలేక పోయింది. నారా రోహిత్ త్వరలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.