Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : గాయపడ్డ సింహం

దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత నటుడిగా మారి మెప్పిస్తున్న తరుణ్ భాస్కర్.. కొన్ని నెలల కిందట వచ్చిన 'ఓం శాంతి శాంతి శాంతి:' చిత్రంలో లీడ్ రోల్ చేశాడు.

By:  Tupaki Desk   |   1 May 2026 3:50 PM IST
మూవీ రివ్యూ : గాయపడ్డ సింహం
X

'గాయపడ్డ సింహం' మూవీ రివ్యూ

నటీనటులు: తరుణ్ భాస్కర్ - ఫరియా అబ్దుల్లా - మానస చౌదరి - శ్రీ విష్ణు - జేడీ చక్రవర్తి - శుభలేఖ సుధాకర్ - కశ్యప్ శ్రీనివాస్ - వాసు ఇంటూరి - అనిత చౌదరి - కృష్ణభగవాన్ - అనీష్ కురువిల్లా - హర్షవర్ధన్ తదితరులు

సంగీతం: స్వీకార్ అగస్తి

ఛాయాగ్రహణం: విద్యాసాగర్ చింత

మూల కథ: సూర్యప్రకాష్ జోస్యుల

నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి - భాను కిరణ్ - విజయ్ కృష్ణ - ఉమేష్ కుమార్ బన్సల్

రచన - దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్

దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత నటుడిగా మారి మెప్పిస్తున్న తరుణ్ భాస్కర్.. కొన్ని నెలల కిందట వచ్చిన 'ఓం శాంతి శాంతి శాంతి:' చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడు అతను 'గాయపడ్డ సింహం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకుందాం పదండి.

కథ:

దరహాస్ (తరుణ్ భాస్కర్) చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. తన ప్రేయసి తండ్రి పెట్టిన కాన్ మేరకు అతను యుఎస్ వెళ్ళి సెటిల్ కావాలనుకున్న దరహాస్.. ఆ దేశ అధ్యక్షుడు తీసుకువచ్చిన కొత్త విధానం వల్ల డిపోర్ట్ అయి తిరుగుటపాలో ఇంటికి వచ్చేస్తాడు. దీంతో ప్రేమించిన అమ్మాయి అతడికి దూరం అవుతుంది. ఈ బాధను తట్టుకోలేక పోయిన అతను యుఎస్ ప్రెసిడెంట్ మీదే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్న దరహాస్ అందుకోసం ఏం చేశాడు.. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు ఆతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడో తెలిసిందే. వీసా నిబంధనలు కఠినతరం చేయడం దగ్గర్నుంచి ఇష్టానుసారం సుంకాలు విధించడం, ఇరాన్ మీద యుద్ధానికి వెళ్లడం వరకు ప్రతి నిర్ణయంతోనూ మిగతా ప్రపంచం మీద ప్రభావం చూపిస్తున్నాడు. ఆయన మనకు ఇబ్బంది కలిగించే నిర్ణయం తీసుకున్నపుడల్లా కోపం వస్తుంది. కానీ సాామాన్యులే కాదు.. దేశాధినేత కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మరి ట్రంప్ వల్ల ఇబ్బంది పడ్డ ఒక కుర్రాడు.. అతడి మీద ప్రతీకారానికి రెడీ అయితే..? అందుకోసం చేతబడిని ఆశ్రయిస్తే..? ఆ తర్వాత ట్రంప్ కు ఏ చిన్న ఇబ్బంది కలిగినా.. అది తన వల్లే అని మురిసిపోతే..? కంటెంపరరీగానే కాక క్రేజీగా అనిపించే ఆలోచన కదా ఇది. ఇలాంటి ప్లాట్ పాయింట్ తో ‘గాయపడ్డ సింహం’ కొంత వరకు భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. కామెడీ బాగా రాయగలిగిన రైటర్ అయితే దీని మీద మంచి కామెడీ సీన్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు. కానీ కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్.. ఒరిజినల్ కామెడీని పండించలేక ఎక్కువగా స్పూఫుల మీద ఆధారపడ్డాడు. ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని నవ్వులు పండాయి కానీ.. ఆ డోస్ సరిపోలేదు.

వర్తమాన పరిస్థితుల ఆధారంగా మెజారిటీ ప్రేక్షకులు బాగా రిలేటయ్యేలా ఈ కథ రాసుకున్నారు కానీ.. సరైన కామెడీ సిచువేషన్స్ క్రియేట్ చేసుకోలేకపోవడంతో ‘గాయపడ్డ సింహం’ పర్వాలేదు అనిపించే స్థాయిని దాటలేకపోయింది. తనను డిపోర్ట్ చేయించిన ట్రంప్ మీద ప్రతీకారం తీర్చుకునే హీరో.. ఈ పాయింట్ మీదే ఈ కథను నడిపిస్తే అది హిలేరియస్ గా వర్కవుట్ అయ్యేదేమో. కానీ ఇందులోకి క్రైమ్ రాకెట్ ట్రాక్ ను తీసుకొచ్చి మిక్స్ చేయడంతో ఈ కథ రొటీన్ క్రైమ్ కామెడీల రూట్ తీసుకుంది. ఒకరికి వెళ్లాల్సిన పార్సిల్ ఇంకొకరికి వెళ్లడంతో గందరగోళం తలెత్తడం.. హీరో బృందం- రౌడీ గ్యాంగు- పోలీసులు ఒకరి వెంట ఒకరు పడడం.. ఇలాంటి ట్రాక్స్ క్రైమ్ కామెడీ సినిమాల్లో ఎప్పుడూ చూసేదే. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం.. పైగా ఇటు కామెడీ అటు థ్రిల్ రెండూ లేకపోవడంతో ఆ ఎపిసోడ్లన్నీ తేలిపోయాయి. జేడీ చక్రవర్తి పాత్ర గురించి ప్రోమోల్లో ఇచ్చిన బిల్డప్పుకి సినిమాలో ఉన్నదానికి పొంతన లేదు. శ్రీ విష్ణు పాత్రను క్యామియోలా కాకుండా ఫుల్ లెంత్ రోల్ లాగే చూపించడం బాగుంది. బుద్ధిగా చదువుకుని కలెక్టర్ అవుతానంటే వంశపారంపర్యంగా వచ్చిన చేతబడి వృత్తిని చేపట్టాలని తండ్రి పట్టుబడడం.. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్ కొంతమేర వినోదాన్ని పంచుతుంది.

ఐతే శ్రీ విష్ణు ఎపిసోడ్ హైలైట్ అయినంతగా.. హీరో వెర్సస్ ట్రంప్ ట్రాక్ సినిమాలో హైలైట్ కాలేదు. అసలు కథే దాని మీద నడిచినపుడు దాన్ని సరిగా ఎలివేట్ చేయడం ముఖ్యం. కానీ మిగతా వ్యవహారాల వల్ల ఈ ఎపిసోడ్ డైల్యూట్ అయిపోవడంతో కథలో హీరో ప్రాధాన్యం తగ్గిపోయిది. అసలు ‘గాయపడ్డ సింహం’ టైటిల్ కే న్యాయం జరగలేదు. ప్లాట్ పాయింటుని సరిగ్గా వాడుకుంటే మంచి వినోదం పండించే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ ప్రయత్నం పెద్దగా చేయలేదు. సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పుతున్న సమయంలో కొన్ని స్పూఫ్ సీన్లతో దర్శకుడు ప్రేక్షకులను కొంచెం ఎంగేజ్ చేశాడు. బొమ్మరిల్లు.. పోకిరి.. సలార్ లాంటి చిత్రాలను గుర్తు చేస్తూ సాగే పేరడీ సన్నివేశాలు రొటీన్ అనిపించినా.. నవ్విస్తాయి. ముగింపులో చెప్పుకోదగ్గ మెరుపులేమీ లేవు. శ్రీ విష్ణు పాత్ర నేపథ్యంలో ‘పోరాట సింహం’ లీడ్ ఇచ్చారు కానీ.. దాని మీద ఆసక్తి రేగే స్థాయిలో ‘గాయపడ్డ సింహం’ కిక్ ఇవ్వలేదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా అక్కడక్కడా కొన్ని నవ్వులతో సరిపెట్టుకుంటాం అంటే ఈ చిత్రంపై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.

నటీనటులు:

దరహాస్ పాత్రలో తరుణ్ భాస్కర్ బాగానే చేశాడు. తన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. కానీ ఈ పాత్రకు కథలో దర్శకుడు ఇవ్వాల్సినంత వెయిట్ ఇవ్వలేదనిపిస్తుంది. తనను ఇంకా బాాగా ఉపయోగించుకుని ఉండాల్సింది. తరుణ్ తో పోలిస్తే తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ శ్రీ విష్ణు ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు. భైరవ దాస్ పాత్రలో మెప్పించాడు. హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా.. మానస చౌదరిలిద్దరికీ చిన్న చిన్న పాత్రలే దక్కాయి. వాళ్లు ఉన్నంతలో తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. హీరోతో పాటే ఉండే స్నేహితుడి పాత్రలో దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఓకే అనిపించాడు. జేడీ చక్రవర్తి పాత్రకు మొదట్లో చాలా బిల్డప్ ఇచ్చారు కానీ.. అందుకు తగ్గ ఎలివేషన్ తర్వాత లేకపోయింది. జేడీ పెర్ఫామెన్స్ అయితే బాగానే చేశాడు. శుభలేఖ సుధాకర్.. ప్రదీప్ రావత్.. హర్షవర్ధన్.. వీళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

‘గాయపడ్డ సింహం’ చిత్రానికి సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. స్వీకార్ అగస్తి పాటలు ఓ మోస్తరుగా అనిపించినా.. నేపథ్య సంగీతంతో ఆద్యంతం సినిమాలో జోష్ నింపడానికి ప్రయత్నించాడు. విద్యాసాగర్ చింత ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ఆకర్షణ. చాలా కలర్ ఫుల్ గా తీశాడు సినిమాను. నిర్మాణ విలువలు ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో ఉన్నాయి. సూర్యప్రకాశ్ జోస్యుల అందించిన మూల కథలో విషయం ఉంది. దానికి కథా విస్తరణ కూడా కశ్యప్ శ్రీనివాస్ బాగానే చేశాడు కానీ.. తన కథనం మాత్రం అంత బలంగా లేకపోయింది. ప్రేక్షకుల్లో నవ్వుల్లో ముంచెత్తడానికి అవసరమైన సెటప్ కుదిరినా.. కామెడీ పండడానికి తగ్గట్లు సన్నివేశాలు రాసుకోలేకపోయారు. దర్శకుడి టేకింగ్ పర్వాలేదు.

చివరగా: గాయపడ్డ సింహం.. కొన్ని నవ్వుల కోసం

రేటింగ్: 2.5/5