Begin typing your search above and press return to search.

గరివిడి 'లక్ష్మి' గ్లింప్స్.. పల్లె పాటల పండుగ మొదలైంది!

పల్లెపాటలకు ప్రాణం పోసిన ఓ ఘనమైన కథతో ‘గరివిడిలక్ష్మి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Tupaki Desk   |   20 July 2025 11:15 PM IST
గరివిడి లక్ష్మి గ్లింప్స్.. పల్లె పాటల పండుగ మొదలైంది!
X

పల్లెపాటలకు ప్రాణం పోసిన ఓ ఘనమైన కథతో ‘గరివిడిలక్ష్మి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తుండగా, గౌరీనాయుడు జమ్ము దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నటి ఆనంది టైటిల్ రోల్‌లో కనిపించనుండటం, ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక లేటెస్ట్ గా విడుదలైన గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.


గ్రామీణ నేపథ్యం, పాటల పట్ల ప్రజల అభిమానాన్ని చూపిస్తూ చిత్ర యూనిట్ సినిమా ప్రచారాన్ని ఆసక్తికరంగా రూపొందిస్తోంది. పల్లెలో జనాల మధ్య మమేకమై, వారి గుండెల్లో నిలిచిపోయేలా పాటలు పాడే గాయని కథే ఈ చిత్రం. ఈ కథ పల్లె సంస్కృతిని ప్రతిబింబించడమే కాకుండా, పాటల ద్వారా ప్రజల మనసులు గెలిచిన ఒక సాధారణ మహిళ గొప్ప ప్రయాణాన్ని చూపించబోతుంది.

ఇప్పుడు విడుదలైన గరివిడిలక్ష్మి గ్లింప్స్ హృదయాన్ని తాకేలా ఉంది. లక్ష్మి గాత్రం వినడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే సన్నివేశాలు, ఆమె పాటల విన్న జనాల్లో కలిగే ఆనందం, కుటుంబాలు కలసి ఆమె ప్రదర్శనను చూసే దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. గత 15 ఏళ్లలో లక్ష్మి దాదాపు 10,000 స్టేజ్ షోలతో తన పేరు ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరించిందని చూపించారు.

లక్ష్మి పాత్రకు గాయకురాలు మంగ్లీ గాత్రం అద్భుతంగా సరిపోయింది. ఆమె వాయిస్ పాటలతో పాటుగా భావోద్వేగాన్ని అందిస్తూ, ప్రేక్షకుడిని ఆ పాత్రకు కనెక్ట్ అయ్యేలా చేస్తోంది. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తుండగా, పాటల్లో గ్రామీణ మాండలికం, జానపద బాణీలు వినిపించేలా ఉన్నాయి. ఇలాంటి కథలపై ఇప్పటివరకు తక్కువ సినిమాలే వచ్చాయి.

ఒక గ్రామీణ గాయని జీవితాన్ని ఆధారంగా చేసుకొని, సంగీతం ద్వారా ఆమె చేసిన ప్రయాణాన్ని చూపించడమంటే ఓ సరికొత్త ప్రయోగమే. ఈ కథలో లక్ష్మి పాత్ర మాదిరిగా నిజజీవితంలో ఎందరో మహిళలు ఉన్నారు. అలాంటి వారికి ఇది ఒక గౌరవం కూడా. ‘గరివిడిలక్ష్మి’ సినిమా ఒక పాటల పండుగలా కనిపిస్తోంది. పల్లె సంస్కృతి, మహిళా సాధికారత, గాయక కళాకారుల జీవితాలను తెరపై ప్రతిబింబించబోయే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరిలో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.