హాస్యనటుడి కేఫ్‌పై కాల్పులు... చిక్కు విప్పే కొద్దీ ట్విస్టులు!
కొన్ని నెలల క్రితం ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కెనడా కేఫ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Dec 2025 9:50 AM ISTకొన్ని నెలల క్రితం ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కెనడా కేఫ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మను హెచ్చరిస్తూ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు ఈ కాల్పులు జరిపారని ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఈ కేసులో కూపీ లాగే కొద్దీ భయానకమైన నిజాలు బయటపడుతున్నాయి.
ఇది కేవలం హాస్య నటుడు కపిల్ శర్మను బెదిరించేందుకు జరిగిన కాల్పులు కానే కావు. దీనివెనక ముఠా కక్షలు, వ్యక్తిగత యుద్ధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో బయటపడింది. ఆ మేరకు జాతీయ మీడియాలు అందించిన కథనాల ప్రకారం... ఢిల్లీ పోలీసులు ఇటీవల కెనడా కేఫ్ కాల్పులకు కారకులుగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసారు. అతడు అందించిన వివరాలప్రకారం..గ్యాంగ్ స్టర్ గోల్డీ ధిల్లాన్ ముఠా సభ్యుడిగా భావిస్తున్న బంధుమన్ సింగ్ బ్రిటిష్ కొలంబియా(కెనడా)లోని సర్రేలోని కాప్స్ కేఫ్‌లో కాల్పులు జరిపిన వారికి సాంకేతికంగా ఆయుధాలు అందించాడని పోలీసులు తెలిపారు. అయితే కాల్పుల సంఘటన తర్వాత మలేషియాకు చెందిన ప్రత్యర్థి ముఠా సభ్యుడు తనను బెదిరించాడని బంధుమన్ సింగ్ విచారణలో పోలీసులకు చెప్పాడు.
ఆగస్టు 2025లో కపిల్ శర్మ కెనడా కేఫ్ లో కాల్పులు జరిగాయి. అప్పుడు కాల్పులకు పాల్పడిన గ్యాంగ్ కు ఒక కార్ ని, ఆయుధాలను బంధుమాన్ సరఫరా చేసాడు. ఆ తర్వాత ఈ ఘటనకు కారకుడైన బంధుమాన్ కి బాంబిహా ముఠా సభ్యుడి నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులు ఎదురయ్యాయి.
నిజానికి ఇది కేవలం కాల్పుల పేరుతో బెదిరించి దోపిడీకి పాల్పడాలని ఒక గ్యాంగ్ భావించినట్టు పోలీసులు అంచనా వేసారు. కానీ అందుకు భిన్నంగా ఇందులో ముఠా కక్షలు బయటపడుతున్నాయి. కాల్పుల సంఘటనల వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న గోల్డీ ధిల్లాన్ ఇప్పటికే భారతదేశంలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ - సోను ఖత్రిలతో కలిసి పని చేస్తున్నాడు. అదే సమయంలో వారి ప్రత్యర్థులు బాంబిహా గ్యాంగ్, గోల్డీ బ్రార్, అర్ష్ డల్లా, తరణ్ గిల్ గ్యాంగ్ వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని కూడా తెలుస్తోంది.
ఈ గ్యాంగ్ స్టర్స్ అందరూ భారతదేశం నుంచి పారిపోయి కెనడా, యునైటెడ్ స్టేట్స్, మలేషియా సహా కొన్ని యూరోపియన్ దేశాల నుండి తమ ముఠాలను నిర్వహిస్తున్నారని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే కేఫ్ పై కాల్పుల ఘటన తర్వాత దీనిని ముఠా కక్షల కింద చూడాలా? లేక కపిల్ శర్మను టార్గెట్ చేసారని భావించాలో అర్థం కాని గందరగోళం నెలకొంది. ఇదంతా రెండు ముఠాల మధ్య వ్యక్తిగత కక్షలకు సంబంధించిన మ్యాటర్ అని కూడా భావిస్తున్నారు.
కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులకు సహకరించిన వ్యక్తి 2023లో తొలిసారి కెనడాకు పారిపోయే ముందు మూడుసార్లు దుబాయ్‌ని సందర్శించాడు. అతడు ఇండోనేషియాలోని బాలికి ఒకసారి వెళ్ళాడని పోలీసులు కనుగొన్నారు. కెనడాలోని బ్రాంప్టన్ చేరుకున్న తర్వాత అతడు మొదట్లో ఒక ఫార్మసీలో పనిచేశాడు. తరువాత ట్రక్ డ్రైవర్‌గా పనిచేశాడు. కాల్పుల ఘటన తరువాత సెప్టెంబర్‌లో అతడు కెనడా నుండి భారతదేశానికి పారిపోయి వచ్చాడు. ఇక్కడ ఢిల్లీ పోలీసులు లూథియానా లో అతడిని అరెస్టు చేశారు. అతడి విచారణలో గ్యాంగ్ స్టర్ యాక్టివిటీస్ అన్నీ బయటపడుతున్నాయి.
