గాంధీ తాత చెట్టు ట్రైలర్: ఊరి రక్షణ కోసం చిన్నారి సాహసం
అప్పుడెప్పుడో 100% లవ్ స్టొరీలో హీరోయిన్ ఇంట్రో షాట్ లో పసిపాపగా కనిపించిన సుకృతి మళ్ళీ ఇప్పుడు ఒక డిఫరెంట్ ఏమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించడం విశేషం.
By: Tupaki Desk | 9 Jan 2025 11:32 AM GMTసుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన సినిమా 'గాంధీ తాత చెట్టు'పై సినీ ప్రపంచంలో మంచి ఆసక్తి నెలకొంది. జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అప్పుడెప్పుడో 100% లవ్ స్టొరీలో హీరోయిన్ ఇంట్రో షాట్ లో పసిపాపగా కనిపించిన సుకృతి మళ్ళీ ఇప్పుడు ఒక డిఫరెంట్ ఏమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించడం విశేషం.
ఇటీవలే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లలో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది. జనవరి 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, సూపర్‌స్టార్ మహేష్‌బాబు సోషల్ మీడియాలో ట్రైలర్‌ను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ విషయానికి వస్తే, గాంధీ సిద్ధాంతాలను అనుసరించే పదమూడేళ్ల అమ్మాయి తన గ్రామాన్ని రక్షించడానికి చేసే ప్రయాణం ఈ కథాంశం అని తెలుస్తుంది. సుకృతి ఇందులో నిజంగా గుండులో కనిపించడం మరో ఆసక్తికరమైన విషయం.
సుకృతి వేణి తన సహజ అభినయంతో ఆ పాత్రను ప్రాణం పోసింది. ట్రైలర్ హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో నిండిఉంది. ఈ సందర్భంగా మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో "ఇది అందరి హృదయాలను హత్తుకునే సినిమా, గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. సుకృతికి, ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు" అంటూ ప్రశంసలు కురిపించారు.
నిర్మాతలు, దర్శకురాలు పద్మావతి మల్లాది సూపర్‌స్టార్ మహేష్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో నెగటివిటీ పెరిగిపోతున్న తరుణంలో, గాంధీ గారి సిద్ధాంతాలను ఈ తరం పిల్లలకు పరిచయం చేయడం ఎంత ముఖ్యమో వివరించడం జరిగింది. అహింస, శాంతి సిద్ధాంతాలను గాఢంగా ఆకళింపు చేసుకున్న ఓ చిన్నారి తన గ్రామం కోసం చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను భావోద్వేగాలకు లోనుచేస్తాయని ఆమె తెలిపారు.
ఈ చిత్రం కోసం సాంకేతిక పరంగా విస్తృత కృషి చేశారని ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. రీ అందించిన సంగీతం సినిమాకు అనుభూతులను మరింతగా ఆకట్టుకుందని మెకర్స్ చెబుతున్నారు. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ లాంటి దిగ్గజుల పాటలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని.. సినిమాటోగ్రాఫర్ శ్రీజిత్ చెర్వుపల్లి కళ్లకు ఆనందాన్ని అందించే దృశ్యాలను అందించారని పేర్కొన్నారు.
సుకృతి వేణి పాత్రలో జీవించి, తన ప్రతిభతో ఇప్పటికే ఉత్తమ బాలనటి పురస్కారం అందుకున్నారు. ఆనంద్ చక్రపాణి, రఘురామ్, నేహాల్ ఆనంద్ తదితరులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. సినిమా ప్రపంచం, కుటుంబ మూల్యాలను గాఢంగా ప్రదర్శించే ఈ చిత్రం అందరికీ కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ‘గాంధీ తాత చెట్టు’ వంటి అనూహ్య కథాంశాలు ప్రేక్షకులను ఆలోచనలో పడేయడమే కాకుండా, వారిని స్ఫూర్తిపొందిస్తాయని టీమ్ నమ్ముతోంది. ఇక జనవరి 24న ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలియజేశారు.