గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ వెనుక అంత జరిగిందా?
`RRR` వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన భారీ పొలిటికల్ థ్రిల్లర్ `గేమ్ ఛేంజర్`.
By: Tupaki Desk | 24 April 2025 5:00 PM IST`RRR` వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన భారీ పొలిటికల్ థ్రిల్లర్ `గేమ్ ఛేంజర్`. శంకర్ డైరెక్ట్ చేశారు. తొలి సారి రామ్‌చరణ్‌తో శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఫలితంగా గ్లోబల్ స్టార్‌కు డిజాస్టర్ ఎదురైంది. శంకర్ డైరెక్టర్ కావడంతో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌పెట్టుకుని మూడేళ్లు శ్రమించినా ఫలితం మాత్రం శూన్యం కావడంతో చరణ్ షాక్ గురికావడం తెలిసిందే.
చరణ్‌తో పాటు ఈ సినిమా కారణంగా దిల్ రాజు కూడా భారీ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. తొలి సారి తమిళ డైరెక్టర్‌తో చేసిన సినిమా ఇలా డిజాస్టర్ కావడంతో దిల్ రాజు, రామ్ చరణ్ ఒకింత షాక్‌కు గురయ్యారు. నిర్మాణం ఆలస్యం కావడంతో మూడేళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 10న భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అనిపించుకుంది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలని తెచ్చి పెట్టి దర్శకుడు శంకర్ కెరీర్‌పై మాయని మచ్చలా మారింది.
ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు., ఆయన అందించిన కథ వల్లే సినిమా ఫ్లాప్ అయిందని, ఈ మూవీ ఫ్లాప్‌కు బాధ్యుడు ఆయనే అని అంతా విమర్శలు గుప్పించారు. అయితే కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం `గేమ్‌ఛేంజర్` ఫ్లాప్‌కు తాను కారణం కాదంటున్నాడు. ఈ మూవీ స్టోరీ వెనుక పెద్ద కథే ఉందని తాజాగా బాంబ్ పేల్చాడు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా మూవీ `రెట్రో`. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా మే 1న భారీ స్థాయిలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ `గేమ్ ఛేంజర్` ఫ్లాప్‌పై సంచలన విషయాల్ని బయటపెట్టారు. `ఓ ఐఏఎస్ ఆఫీసర్ కథను శంకర్‌కు చెప్పానని, కానీ ఆ తరువాత తాను చెప్పిన స్టోరీని శంకర్ పూర్తిగా వేరేలా మార్చేశారని, కొత్త రైటర్లు చాలా మందిని తీసుకుని కథ, స్క్రీన్‌ప్లే సమూలంగా మార్చేశారని, దాంతో తాను చెప్పిన కథ మారిపోయిందని కార్తీక్ సుబ్బరాజ్ బాంబ్ పేల్చడం సంచలనంగా మారింది. అంటే తను ఇచ్చిన కథని కలగా పులగం చేసి శంకర్ కంగాళీ చేశాడని కార్తీక్ సుబ్బరాజ్ ఇండైరెక్ట్‌గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి కార్తీక్ సుబ్బరాజ్ కామెంట్‌లపై శంకర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.