Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను' ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి సినీ ప్రముఖులు తమ ధన్యవాదాలు తెలిపారు.

By:  Tupaki Desk   |   29 May 2025 4:16 PM IST
తెలంగాణ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను' ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి సినీ ప్రముఖులు తమ ధన్యవాదాలు తెలిపారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం నుంచి సినీ పురస్కారాలు రావడంపై పలువురు అగ్రతారలు, దర్శకులు, నిర్మాతలు తమ సంతోషాన్ని, కృతజ్ఞతలను సోషల్ మీడియా వేదికైన ఎక్స్ (X) ద్వారా పంచుకున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం సినీ పరిశ్రమలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

తెలంగాణ సినిమాకు గొప్ప గౌరవం : ఎన్టీఆర్

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనసారా అభినందించారు. తన ఎక్స్ (X) ట్విట్టర్ ఖాతాలో ఆయన ఇలా పేర్కొన్నారు.."తెలంగాణ ప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద అవార్డులను ప్రకటించడం చాలా సంతోషకరం. ఇది తెలంగాణ సినిమాకు, ఇక్కడి కళాకారులకు లభించిన గొప్ప గౌరవం. సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి అడుగు. దేవర చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ అందుకున్న గణేష్ ఆచార్యకు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

తెలుగు సినీ రంగానికి పెద్ద ప్రోత్సాహం : అల్లు అర్జున్

'పుష్ప' స్టార్ అల్లు అర్జున్ కూడా గద్దర్ అవార్డుల ప్రకటనపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ (X) అకౌంట్‌లో ఇలా ట్వీట్ చేశారు..‘‘'పుష్ప 2'కు గానూ గద్దర్ అవార్డ్స్ 2024లో మొట్టమొదటి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నందుకు నేను నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం నా దర్శకుడు సుకుమార్ గారికి, నా నిర్మాతలకి, మొత్తం పుష్ప టీమ్‌కు దక్కుతుంది. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. మీ అచంచలమైన మద్దతు నాకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది.’’ అంటూ రాసుకొచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టడం తెలుగు సినీ రంగానికి చాలా పెద్ద ప్రోత్సాహం. కళాకారులను, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించడం అభినందనీయం. ఈ అవార్డులు సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాయని, ఈ అవార్డుల ప్రకటన సినీ రంగంలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన అన్నారు.

గౌరవంగా భావిస్తున్నా : నాగాశ్విన్

2024 సంవత్సరానికి 'బెస్ట్ ఫీచర్ ఫిల్మ్' అవార్డును దక్కించుకున్న 'కల్కి 2898 ఏడీ' చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ.. "మా సినిమా 'కల్కి 2898 ఏడీ'కి 'బెస్ట్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు దక్కడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. గద్దర్ గారి పేరు మీద ఈ అవార్డును అందుకోవడం గొప్ప అదృష్టం. తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు." అని రాసుకొచ్చారు.

తమిళ స్టార్ సూర్య కూడా గద్దర్ అవార్డుల ప్రకటనను స్వాగతించారు. ఆయన ఎక్స్ లో ట్వీట్ చేస్తూ..‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారికి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు గారికి, జయసుధ మేడమ్‌కి, జ్యూరీ సభ్యులందరికీ, నా దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి, మన నేచురల్ స్టార్ నాని గారికి, సూపర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య గారికి, మా తెలుగు ప్రేక్షకులకు.. ఈ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మొట్టమొదటి తెలంగాణ గద్దర్ అవార్డును అందుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చారు.

ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ ఇప్పటికే ప్రకటించారు. అలాగే, 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు కూడా అవార్డులు త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఎంతోమంది సినీ ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.