హతవిధీ.. అవార్డుల కోసం 14ఏళ్ల నిరీక్షణ!
మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ అవార్డుల వేడుక గనుక దీనికి స్టార్లు అంతా ప్రాధాన్యతనిస్తారని భావిస్తున్నారు.
By: Tupaki Desk | 31 May 2025 11:39 PM ISTఫిలింఫేర్ లు.. సైమా అవార్డులు.. సంతోషం అవార్డులు లేదా ఇంకేదైనా అవార్డుల కార్యక్రమం.. హైదరాబాద్ లో చాలా అవార్డుల కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ వేదికపై కి టాలీవుడ్ ప్రముఖులను అందరినీ లాక్కుని రాగలిగే ఈవెంట్ మాత్రం మిస్సవుతున్నాం. ప్రస్తుతం తెలుగు చిత్రసీమను ఏల్తున్న డజను మంది అగ్ర హీరోలను వేదికపైకి తేగలిగితేనే, ఆ ఉత్సవంలో ప్రత్యేక కళ ఉంటుంది. నలుగురు మూల స్థంబాల్లాంటి సీనియర్ హీరోలు, డజను యంగ్ హీరోలు, పాన్ ఇండియన్ స్టార్లు, వీళ్లతో పాటు గ్లామరస్ కథానాయికలు, 24 శాఖల్లో ప్రతిభావంతులు వేదికలు ఎక్కితేనే, జనాలకు కిక్కు ఎక్కుతుంది.
కానీ అలాంటి కిక్కునిచ్చే వేడుక అక్కటంటే ఒక్కటీ లేదు ఈ పద్నాలుగేళ్లలో. ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోయాక పరిస్థితి ఇది. అప్పట్లో నంది అవార్డులతో ఇలాంటి ఉత్సాహం కనిపించేది. ప్రభుత్వ అధికారిక అవార్డుల కార్యక్రమం కాబట్టి వేదికపై కనిపించేందుకు సెలబ్రిటీలంతా ఉత్సాహపడేవారు. ప్రయివేట్ అవార్డులతో పోలిస్తే ఇది విభిన్నమైన కార్యక్రమం. అందరికీ ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమం. కానీ పద్నాలుగేళ్లుగా నంది అవార్డుల్లేవ్. సింహా అవార్డులు అంటూ తెలంగాణ ప్రభుత్వాలు ఊరించి విసిగించారు కానీ, అవి కూడా లేవు.
ఎట్టకేలకు గద్దర్ అవార్డుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పురస్కారాలు ఇస్తుంటే టాలీవుడ్ లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఈ వేదికపై ఈసారి టాలీవుడ్ ప్రముఖ హీరోలందరినీ చూసేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి ప్రముఖులను ఈ వేదికపై వీక్షించేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అది అభిమానులకు కన్నుల పండుగగా మారుతుంది. అవార్డ్ వస్తేనే అవార్డుల వేడుకకు వెళ్లాలని స్టార్లు అనుకోకూడదు.
మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ అవార్డుల వేడుక గనుక దీనికి స్టార్లు అంతా ప్రాధాన్యతనిస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన జూరీ నుంచి తెలుగు స్టార్లు, 24 శాఖల ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందుతాయి గనుక, వేదిక కళకళలాడుతుందని అంతా భావిస్తున్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024ను ప్రకటించింది. 24 కళలలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం టాలీవుడ్ లో కీలక అడుగు అని ప్రజలు భావిస్తున్నారు. పరిశ్రమ ఉత్సాహంగా ఉంది. ఈ గ్రాండ్ ఈవెంట్ జూన్ 14న మాదాపూర్ - హైటెక్స్‌లో జరుగుతుంది.
