గద్దర్ పురస్కారాలపై కన్ఫ్యూజన్?
అవార్డు గ్రహీతల ఎంపికలో పూర్తి నిష్పాక్షికతను కొనసాగించడానికి అవసరమైన చర్యలపై వారంతా చర్చించారు.
By: Tupaki Desk | 18 April 2025 4:00 AM ISTప్రముఖ విప్లవకవి, జానపద గాయకుడు గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం సినీరంగానికి అవార్డులను అందించనున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కారాలను జనవరి 31న గద్దర్ జయంతి సందర్భంగా ప్రదానం చేయాలని భావిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీపరిశ్రమ స్వాగతించింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ లో నంది పురస్కారాలను ఏ విధంగా ప్రతియేటా అందజేసారో అదే విధంగా గద్దర్ అవార్డులను అందజేయనున్నారు.
ఈ పురస్కారాలకు జూరీ చైర్మన్ గా సహజనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధను ఎంపిక చేయడం హర్షణీయం. జయసుధ నేతృత్వంలో జ్యూరీ సమావేశంలో పలు అంశాలు ప్రస్థావనకు వచ్చాయి. ఈ సమావేశంలో ఎఫ్‌డిసి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు. అవార్డు గ్రహీతల ఎంపికలో పూర్తి నిష్పాక్షికతను కొనసాగించడానికి అవసరమైన చర్యలపై వారంతా చర్చించారు. కళారంగంలోవారికి తగిన ప్రోత్సాహం అందేలా ఈ పురస్కారాలను ఏర్పాటు చేయగా, తమవంతు సహకారం అందించేలా సినీపరిశ్రమను ఐక్యం చేయడమే ఈ సమావేశం లక్ష్యం. ఫీచర్ ఫిలింస్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలింస్, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, డాక్యు సిరీస్ లు, లఘు చిత్రాలు సహా చాలా విభాగాలలో పురస్కారాలను అందించనున్నారు.
అయితే గద్దర్ పురస్కారాలను ఏ ప్రాతిపాదికన అందించనున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలను అందజేస్తే, అప్పుడు ఏపీ కళాకారులు, తెలంగాణ కళాకారులు డివైడ్ ఫ్యాక్టర్ ను చూడాల్సి ఉంటుంది కదా? ఎలాంటి డివైడ్ లేకుండా హైదరాబాద్ లో ఉన్న సినీకళాకారులందరికీ గద్దర్ పురస్కారాలను అందజేస్తారా? దీనికి ఆంధ్రా తెలంగాణ అనేది వర్తించదా? ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి. వీటికి ఫిలింఛాంబర్ సహా గద్దర్ పురస్కారాల కమిటీ మరింత స్పష్ఠతనిస్తుందేమో చూడాలి.
