గద్దర్ అవార్డులన్నీ బాలయ్యకేనా?
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 'సింహా అవార్డు'లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ డివైడ్ తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సిన అధికారిక పురస్కారాల్ని ఎవరూ పట్టించుకోలేదు.
By: Tupaki Desk | 30 May 2025 3:50 PM ISTతెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 'సింహా అవార్డు'లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ డివైడ్ తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సిన అధికారిక పురస్కారాల్ని ఎవరూ పట్టించుకోలేదు. గత తెరాస ప్రభుత్వం సినిమా అవార్డులను పూర్తిగా లైట్ తీస్కుంది. సింహా అవార్డులు పేరుతో ప్రభుత్వం అధికారికంగా పురస్కారాల్ని అందించాలని భావించినా అది ముందుకు సాగలేదు. అలా ఎనిమిదేళ్లుగా పెండింగ్ లో పడిపోగా, ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను ప్రకటించడమే గాక, ప్రతియేటా పురస్కారాలు అందజేస్తామని, పరిశ్రమకు అండగా నిలుస్తామని సంకేతం పంపింది.
ఆ మేరకు 2015 నుంచి 2023 వరకూ ప్రతియేటా ఉత్తమమైన మూడు చిత్రాలను ఎంపిక చేయడం ఆసక్తిని కలిగించింది. ఉత్తమ చిత్రం కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాల్ని ప్రకటించారు. ఈసారి ప్రకటించిన పురస్కారాల్లో నటసింహా నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించడమే గాక, ఆయన నటించిన రెండు సినిమాలకు ఫ్యాన్స్‌ని ఎగ్జయిట్ చేసేలా ప్రతిష్ఠాత్మక పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేసింది.
గద్దర్ అవార్డుల్లో 2021 సంవత్సరానికి గాను `అఖండ`కు రెండో ఉత్తమ సినిమాగా పురస్కారం దక్కగా, 2023లో మూడో ఉత్తమ చిత్రంగా ఎన్బీకే `భగవంత్ కేసరి` పురస్కారాల్ని దక్కించుకున్నాయి. ఇక ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ తనకు దక్కడంపై బాలయ్య మాట్లాడుతూ.. నాన్నగారి ఆశీస్సులు తనకు ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఈ అవార్డుల్ని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
